
ఆగని అక్రమ గ్రావెల్ దందా
● సెలవు రోజుల్లో దూకుడు పెంచిన అక్రమార్కులు
● పత్తాలేని రెవెన్యూ అధికారులు
అచ్యుతాపురం : సెలవులొస్తే అధికారులకు విశ్రాంతి. గ్రావెల్ అక్రమార్కులకు నిద్ర పట్టదు.సెలవు దినాల్లో స్తబ్థుగా ఉండే అధికారుల అలసత్వాన్ని ఉపయోగించుకొని గ్రావెల్ డిమాండ్‌కు తగ్గట్టుగా జడలు విప్పుతున్నారు. అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకూ గ్రావెల్ తరలింపు జోరుగా సాగిపోయింది. రహదారుల అవసరాలకని కొందరు మీడియా ముందు ప్రకటించినప్పటికీ ఎటువంటి అనుమతు లు లేకుండా గ్రావెల్‌ను తరలించుకుపోవడం నేరమే. వాల్టా చట్టం ఉల్లంఘనతో స్థానిక పరిస్థితు ల వాతారణ సమతుల్యత దెబ్బతింటుందనే స్పృహ లేకుండా గ్రావెల్‌ను తవ్వేస్తున్నారు. దీంతో కొండలు రూపురేఖలు కోల్పోతున్నాయి. ఇటీవల కాలంలో లే అవుట్‌లకు, పరిశ్రమల అవసరాలకు గ్రావెల్‌ను తరలించుకుపోవడం షరా మామూలు అయ్యింది. భూగర్భ గనుల శాఖ పరిధిలో తాత్కాలిక ప్రాతిపదికన, నిర్ణీత కాల పరిమితితో గ్రావెల్ తవ్వకాలకు అనుమతిస్తారు. దీనికి టన్నుకు కొంత మేరకు సీనరైజ్ చెల్లించాలి. ఎటువంటి అనుమతులు లేకుండా గ్రావెల్‌ను తరలించుకుపోవడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంది.
కంపెనీలు ఎలా అనుమతిస్తున్నాయో..?
సెజ్‌లోని పరిశ్రమలకు గ్రావెల్ అవసరం ఎక్కువగా పడింది. అచ్యుతాపురం–అనకాపల్లి రోడ్డు విస్తరణకు కూడా అవసరం అయ్యింది. ఆయా పనులకు అధికారికంగా బిల్లులు చెల్లిస్తారు. కానీ ఎటువంటి సీనరైజ్ బిల్లులు లేకుండా గ్రావెల్‌ను సమకూర్చుకుంటున్న సదరు సంస్థలు ఎలా నగదు చెల్లిస్తున్నాయో? అని విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రావెల్ అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన ప్రభుత్వ యంత్రాంగం కొన్ని లారీ నంబర్లను తమ వద్ద ఉంచుకొని వాటిని వదిలేస్తున్నారని సమాచారం. కొండల వద్ద పర్యవేక్షణ, నిఘా ఉంచాల్సిన వీఆర్‌ఓలు, తలయారీలు నిమ్మకునీరెత్తినట్టు ఉంటున్నారు. విజిలెన్స్ దాడులు కూడా జరగడం లేదు. దీంతో యలమంచిలి నియోజక వర్గంలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు అధికార హోదాలో జరగడం స్థానికులను ఔరా అనిపిస్తుంది.

ఆగని అక్రమ గ్రావెల్ దందా