
ఒకేసారి రెండు ఉద్యోగాలకు ఎంపిక
నక్కపల్లి : మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన యువకుడు ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన పిట్ల స్వామి నరేంద్ర తల్లిదండ్రులు కూలి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తన రెక్కల కష్టం మీద ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి కొడుకును ఉన్నత చదువులు చదివించారు. నరేంద్ర ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో ఏపీఎస్పీ సివిల్ విభాగాల్లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. అలాగే డీఎస్‌సీ ఫలితాల్లో ఎస్‌జీటీ విభాగంలో 84.65 శాతం మార్కులతో 100వ ర్యాంకు సాధించి ఉపాధ్యాయుడిగా కూడా ఎంపికయ్యాడు. ఒకేసారి తమ కుమారుడు రెండు ఉద్యోగాలు సాధించడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తిపై ఉన్న మమకారంతో గతంలో నేవీలో వచ్చిన ఉద్యోగాన్ని సైతం వదులుకున్నానని నరేంద్ర తెలిపాడు. ఉపాధ్యాయుడిగా చేరి గ్రూప్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అయి ప్రజాసేవచేసే ఉన్నత ఉద్యోగం సంపాదించడమే లక్ష్యమని తెలిపారు.