
పీజీఆర్‌ఎస్‌పై వర్షం ప్రభావం.. తగ్గిన అర్జీలు
తుమ్మపాల: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావం కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికపై పడింది. అర్జీదారులు అంతంత మాత్రంగా వచ్చి తమ సమస్యలు విన్నవించుకున్నారు. కలెక్టర్ విజయకృష్ణన్, డీఆర్వో వై.సత్యనారాయణరావు అర్జీలు స్వీకరించారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి అర్జీదారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పలు ప్రజా సంఘాల నేతలు కలెక్టరేట్ వద్ద చేపట్టనున్న ధర్నాలను వర్షం కారణంగా నిలిపివేశారు.
●పీజీఆర్‌ఎస్‌లో పరిష్కరించిన వినతులను దరఖాస్తుదారుడికి తెలియజేయాలని, పరిష్కారం కాని అర్జీల గురించి కారణాలు అర్జీదారుడికి వివరంగా తెలియజేయడం ద్వారా అర్జీలు రీ ఓపెన్ కాకుండా నివారించవచ్చని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. అర్జీలు జిల్లా అధికారి లాగిన్‌లో ఉంటే జిల్లా అధికారి, మండల అధికారి లాగిన్‌లో ఉంటే మండల అధికారి నేరుగా క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లి పరిష్కరించాలన్నారు. మొత్తం 94 అర్జీలు నమోదు కాగా.. 52 రెవెన్యూ అర్జీలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో కేఆర్‌ఆర్‌సీ, పీజీఆర్‌ఎస్ ప్రత్యేక ఉప కలెక్టర్లు ఎస్.సుబ్బలక్ష్మి, రమామణి, డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రావు, డీఆర్‌డీఏ, హౌసింగ్, డ్వామా, మెప్మా పీడీలు శచిదేవి, శ్రీనివాస్, పూర్ణిమ దేవి, కె.సరోజినీ, జిల్లా పంచాయతీ అధికారి సందీప్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం.హైమావతి, జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి వి.సుధీర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కూటమి నాయకులపై ఫిర్యాదు
పంచాయతీ ఆస్తులకు రక్షించడంలో నిర్లక్ష్యంగా ఉన్న పంచాయతీ కార్యదర్శిపై చర్యలతో పాటు ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిన కూటమి నాయకులపై కేసు నమోదు చేయాలంటూ అనకాపల్లి మండలం బట్లపూడి పంచాయతీ రాయుడుపేట గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రూ.10 లక్షల ప్రభుత్వ నిధులతో చేపట్టిన మోదకొండమ్మ సామాజిక భవనం మెట్లను ఈ నెల 10న కొందరు వ్యక్తులు ధ్వంసం చేయడంపై చేసిన ఫిర్యాదును కనీసం పట్టించుకోలేదని ఆరోపించారు. అక్రమ నిర్మాణానికి సహకరిస్తున్న పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని మళ్లీ అర్జీ అందజేశారు.
సాగు హక్కుల కోసం దళితుల వినతి
జీడి, మామిడి పంటలు సాగు చేసుకుంటున్న భూములను ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయించి సాగు హక్కులు కల్పించాలంటూ అనకాపల్లి మండలం తగరంపూడి గ్రామానికి చెందిన దళితులు కలెక్టర్‌ను వేడుకున్నారు. రాళ్లురప్పలతో ఉన్న కొండ పోరంబోకును 40 ఏళ్ల కిత్రం ప్రభుత్వం ఇచ్చిందని, కొండను చదును చేసుకుని జీడి సాగు ద్వారా ప్రతి ఏటా వచ్చిన ఫలసాయంతో జీవిస్తున్నామని, ఇప్పుడు భూములు లాక్కుంటే తమ బతుకులు రోడ్డుపాలవుతాయని వాపోయారు. సర్వే నం.60లో తమకిచ్చిన భూములు మినహా 260 ఎకరాల భూమి ఉందని, ప్రభుత్వ అవసరాలకు సదరు భూమిని వినియోగించుకుని తమకు మినహాయింపు ఇవ్వాలని కోరారు.