
ప్రమాద స్థాయిలో కోనాం జలాశయం నీటిమట్టం
జలాశయం గేట్లు ద్వారా విడుదలవుతున్న నీరు
చీడికాడ: మండలంలోని కోనాం జలాశయం నీటిమట్టం ఒక్క రోజులో మూడున్నర మీటర్లు పెరిగి ప్రమాదస్థాయికి చేరుకుంది. దీంతో సోమవారం ఉదయం ప్రధాన గేట్లు ద్వారా 1200 క్యూసెక్కుల నీటి దిగువకు విడుదల చేసినట్టు ఏఈ దొర తెలిపారు. ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో జలాశయంలోకి ఇన్‌ఫ్లో 1200 క్యూసెక్కులు రావడంతో నీటిమట్టం ఒక్కసారిగా మూడున్నర మీటర్లు పెరిగి 99.80 మీటర్లకు చేరుకుంది. అధికారులు అప్రమత్తమై వచ్చిన ఇన్‌ఫ్లోను దిగువకు అదే విధంగా పంపించారు. సోమవారం ఉదయం నుంచి ఇన్‌ఫ్లోను బట్టి 850 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 99.80 మీటర్లు కాగా.. ప్రమాద స్థాయి నీటిమట్టం 101.25 మీటర్లు.