
బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్‌తో ఆటో దగ్ధం
దేవరాపల్లి: దేవరాపల్లిలో బ్యాటరీ ఆటో దగ్ధమైన సంఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అల్లు వెంకటరావు ఆదివారం రాత్రి ఇంటి ముందు తన ఆటోను పార్కింగ్ చేశాడు. సోమవారం ఉదయం అకస్మాత్తుగా ఆటోలో మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు వెంకటరావుకు సమాచారం ఇచ్చారు. బాధితుడు వచ్చి చూసేసరికి ఆటో పూర్తిగా మంటల్లో చిక్కుకుని ఉంది. మంటలు అదుపు చేస్తూనే చోడవరం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అయితే సిబ్బంది వచ్చేసరికే ఆటో పూర్తిగా కాలిపోయింది. ఆటోలోని బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ జరగడంతోనే మంటలు రేగినట్టు భావిస్తున్నారు. సుమారు రూ.1.50 లక్షల మేర ఆస్తినష్టం జరిగిందని, జీవనాధారం కోల్పోయానని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.