
జల జీవనం
బుచ్చెయ్యపేట: తాచేరు డైవర్షన్ రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్న వరదనీరు
చోడవరం: మండలంలో నీట మునిగిన వరి పొలం
తుమ్మపాల/అనకాపల్లి టౌన్: భారీ వర్షాలతో జిల్లాలోని అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆదివారం తెల్లవారు నుంచి తెరపివ్వకుండా వాన కురిసింది. వాగులు, వంకలు, పలు చోట్ల రోడ్ల మీదుగా వర్షపునీరు ఏరులై పారుతోంది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి పంటలు నీట మునుగుతున్నాయి. రానున్న రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ కార్యాలయం, రెవెన్యూ డివిజనల్, మండల కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. వర్ష ప్రభావంతో గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమయినా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా యంత్రాంగం ఆదేశించడంతో సచివాలయ, రెవెన్యూ సిబ్బంది గ్రామాల్లో స్థితిగతులపై దృష్టి సారించారు. అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. విద్యార్థుల రక్షణ, భద్రత దృష్ట్యా ముందస్తుగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలలకు సెలవు ప్రకటించినట్టు పేర్కొన్నారు.
నీట మునిగిన చోడవరం శ్రీ స్వయంభూ విఘ్నేశ్వరస్వామి
చోడవరం: వరద ముంపు ఆదిదేవుడైన వినాయకుడికి కూడా తప్పలేదు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న చోడవరం శ్రీ స్వయంభూ విఘ్నేశ్వరస్వామి ఆలయం వరద ముంపులో ఆదివారం చిక్కుకుంది. స్వామివారి ప్రధానాలయం ఏనుగుబోదు చెరువు గర్భంలో ఉండటంతో తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువు నిండిపోయింది. దీంతో స్వామివారి గర్భాలయంలో చెరువు ఊటనీరు బయటకు రావడంతో ఆలయంలో స్వామివారి మూలవిరాట్‌్ విగ్రహం మునిగిపోయింది. గర్భాలయంలోకి ఊరుతున్న నీటిని బయటకు పంపించేందుకు మోటార్ల సాయంతో చర్యలు చేపట్టారు. తుపాను వర్షాలకు చోడవరం పరిసర ప్రాంతాల్లో పొలాలన్నీ నీట మునిగాయి. రోడ్లపై ఎక్కడిక్కడ నీరు నిలిచిపోవడంతో చోడవరం– అనకాపల్లి ,చోడవరం–నర్సీపట్నం ప్రధాన రహదారిపై పెద్దపెద్ద గోతులు పడి వాహనచోదకులకు ప్రాణాంతకంగా మారాయి. పట్టణంలో బాలాజీనగర్, న్యూశాంతినగర్, చీడికాడ రోడ్డు ప్రాంతాల్లో వర్షపునీరు రోడ్లపై ప్రవహించింది.
పిడుగుపడి 28 గొర్రెలు మృతి
ఉరుములు, మెరుపులతో ఆదివారం పిడుగు పడి దుడ్డుపాలెం గ్రామంలో 28 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. కూర్మదాసు తాతారావుకు చెందిన 18 గొర్రెలు, కూర్మదాసు రమణకు చెందిన 5 గొర్రెలు, మొల్లి గోవిందకు చెందిన 5 గొర్రెలను గ్రామ సమీపంలో ఉన్న కొండపైకి శనివారం రాత్రి తీసుకెళ్లి ఉంచారు. ఆదివారం ఉదయం వెళ్లి చూడగా మొత్తం గొర్రెలన్నీ పిడుగుపాటుకు మృతి చెంది ఉన్నాయి. వీటి సుమారు రూ. 3 లక్షలు విలువ ఉంటుందని బాధిత పెంపకందారులు చెప్పారు.
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు 08924 222888 08924 225999 08924 226599
రోడ్లను ముంచెత్తిన వరద నీరు
బుచ్చెయ్యపేట: మండలంలో ఆదివారం ఒక్క రోజులోనే 60 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నుంచి వరద నీరు ప్రవహించగా పలు గ్రామాల్లో పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయి. వరి, మినుము, పెసర, నువ్వులు, కూరగాయ పంటలు నీట మునిగాయి. వడ్డాది పెద్దేరు నది, విజయరామరాజుపేట తాచేరు నదిపైన ఉన్న డైవర్షన్ రోడ్లపై నుంచి వరద నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వడ్డాది, పేట డైవర్షన్ రోడ్ల వద్ద పోలీసులు ప్రమాదాలు జరగకుండా ఎస్‌ఐ శ్రీనివాసరావు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారులను పోలీసులు మూసివేయడంతో వాహనదారులు గౌరీపట్నం, బుచ్చెయ్యపేట, మంగళాపురం మీదుగా చోడవరం, అనకాపల్లి, విశాఖ, నర్సీపట్నం ప్రాంతాలకు ఇరుకు రోడ్లపై రాకపోకలు సాగిస్తున్నారు. బుచ్చెయ్యపేట తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ (నంబర్: 08943 294391) ఏర్పాటు చేసినట్టు తహసీల్దార్ లక్ష్మి తెలిపారు.
జిల్లాలో వర్షపాతం
(రాత్రి 10 గంటల వరకు)
సాక్షి, అనకాపల్లి: గడిచిన 24 గంటల్లో జిల్లాలో కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.
మండలం మి.మీ.
చీడికాడ 150.6
కె.కోటపాడు 146.8
దేవరాపల్లి 144.2
మాడుగుల 141.6
చోడవరం 131.8
రోలుగుంట 125.0
రావికమతం 122.6
బుచ్చెయ్యపేట 114.8
అచ్యుతాపురం 100.8
యలమంచిలి 96.8
నర్సీపట్నం 92.4
మాకవరపాలెం 86.4
మునగపాక 77.8
పాయకరావుపేట 76.8
కశింకోట 75.6
అనకాపల్లి 73.2
గొలుగొండ 71.2
కోటవురట్ల 59.4
నాతవరం 56.8
రాంబిల్లి 55.4
నక్కపల్లి 53.8
ఎస్.రాయవరం 46

జల జీవనం

జల జీవనం

జల జీవనం

జల జీవనం

జల జీవనం