
రైవాడ జలాశయంలోకి పోటెత్తిన వరదనీరు
దేవరాపల్లి: గత రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి రైవాడ జలాశయంలోకి భారీగా వరదనీరు పోటెత్తుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 800 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. రైవాడ జలాశయం గరిష్ట నీటిమట్టం 114 మీటర్లు కాగా ప్రస్తుతం 111.80 మీటర్లకు చేరుకుంది. 113.50 మీటర్లకు చేరుకుంటే గేట్ల ద్వారా శారదానదిలోకి నీటి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇరిగేషన్ డీఈఈ జి. సత్యంనాయుడు తెలిపారు. ఏ సమయంలోనైనా నీరు విడుదల చేసే అవకాశం ఉన్నందున శారదానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికార్లు తెలిపారు.
ప్రమాద స్థాయిలో పెద్దేరు
మాడుగుల: పెద్దేరు జలాశయంలో ఆదివారం సాయంకాలానికి వరద పోటు పెరిగింది. జలాశయంలోకి 900 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో అంతే వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం గరిష్ట నీటిమట్టం 137 మీటర్లు కాగా ప్రస్తుతం 136.80 మీటర్ల ప్రమాద స్థాయికి చేరడంతో జలాశయం అధికారులు అప్రమత్తమయ్యారు.