రెచ్చిపోతున్నరేషన్‌ మాఫియా | - | Sakshi
Sakshi News home page

రెచ్చిపోతున్నరేషన్‌ మాఫియా

Aug 18 2025 5:56 AM | Updated on Aug 18 2025 5:56 AM

రెచ్చ

రెచ్చిపోతున్నరేషన్‌ మాఫియా

80 శాతం చౌక బియ్యం పక్కదారి

భారీ ఎత్తున రవాణా చేస్తున్న దళారులు

కార్డుదారుల నుంచి కొన్న బియ్యం మిల్లుల్లో దాచి.. దర్జాగా తరలింపు

తూతూ మంత్రంగా కేసులు

కఠిన చర్యలు లేకపోవడమే కారణం

కొనేది రూ.18... ఎగుమతి చేసేది రూ.40

● ఈ నెల 8వ తేదీ రాత్రి యలమంచిలి మండలం ఏటికొప్పాక రైల్వేగేటు వద్ద 130 బస్తాల్లో 6.5 టన్నుల రేషన్‌ బియ్యాన్ని తరలిస్తున్న లారీని యలమంచిలి డీటీ వినయ్‌కుమార్‌, వీఆర్వోలు పట్టుకున్నారు.

● గత నెల 10వ తేదీన యలమంచిలి మున్సిపాలిటీ తెరువుపల్లి న్యూ వెంకటేశ్వర రైసు మిల్లు నుంచి కాకినాడ పోర్టుకు తరలిస్తున్న 15 టన్నుల రేషన్‌ బియ్యంతో పాటు వాహనాన్ని యలమంచిలి రూరల్‌ పోలీసులు స్వాధీనపరుచుకున్నారు.

చౌక దుకాణాల ద్వారా పేద ప్రజలకు పంపిణీ అవుతున్న బియ్యం ఇలా నిత్యం వాహనాల్లో అక్రమ రవాణా జరుగుతోంది. ప్రతి నెలా రేషన్‌ పంపిణీ చేసే మొదటి రెండు వారాల్లో చౌక బియ్యం రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది.

యలమంచిలి రూరల్‌: జిల్లాలో రేషన్‌ మాఫియా రెచ్చిపోతోంది. కార్డుదారుల వద్ద వేలిముద్ర తీసుకోకముందే బియ్యాన్ని వాహనాల్లో తరలిస్తున్నారు. అక్రమ వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతామంటూ కూటమి ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయి. కూటమి పార్టీల నాయకుల అండదండలతోనే ఈ దందా యథేచ్ఛగా సాగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేషన్‌ షాపులు, లబ్ధిదారుల వద్ద బియ్యం కొనుగోలు చేసి కాకినాడ పోర్టుకు, ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు. పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యం పెద్ద ఎత్తున నల్లబజారుకు తరలిపోతున్నా దీనిని అరికట్టడంలో పౌరసరఫరాల శాఖ అధికారులు విఫలమవుతున్నారు. ఎక్కడైనా రేషన్‌ బియ్యం పట్టుబడినా కేసులు పెట్టి మమ అనిపిస్తున్నారన్న విమర్శలున్నాయి.

80 శాతం నల్లబజారుకే..

ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే రేషన్‌ బియ్యాన్ని పలువురు అక్రమార్కులు ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 5,09,688 తెల్ల కార్డులు, 25,804 అంత్యోదయ కార్డులు ఉండగా 15,15,602 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున నెలకు సుమారు 7,578 మెట్రిక్‌ టన్నుల బియ్యం ఉచితంగా పంపిణీ అవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కిలో రేషన్‌ బియ్యానికి రూ.43 చొప్పున ఖర్చు చేస్తున్నాయి. జిల్లాలో కార్డుదారులందరికీ ప్రతి నెలా బియ్యం సరఫరా చేయడానికి దాదాపు రూ.32.59 కోట్లకు పైగా వెచ్చిస్తున్నాయి. అందులో 20 శాతం మాత్రమే సక్రమంగా వినియోగం అవుతోంది. సుమారు రూ.26 కోట్ల విలువైన బియ్యం పక్కదారి పడుతోంది. ఏడాదికి ప్రభుత్వాలు ఖర్చు పెట్టే 391 కోట్లలో 312 కోట్ల విలువైన బియ్యం నల్లబజారుకే తరలిపోతోంది. రేషన్‌ బియ్యం ఎక్కువగా రైస్‌ మిల్లులకు చేరుతోంది. రైస్‌ మిల్లుల్లో పెద్ద ఎత్తున చౌక బియ్యం నిల్వలు ఉంటున్నా మిల్లుల నిర్వాహకులు ఇచ్చే మామూళ్లకు ఆశపడి అధికారులు తనిఖీలు చేయడంలేదన్న ఆరోపణలున్నాయి.

అధికారులు ఏం చేస్తున్నట్టు?

నిత్యం రేషన్‌ బియ్యం అక్రమ కొనుగోళ్లు, రవాణా, రీసైక్లింగ్‌ జరుగుతున్నా పౌరసరఫరాల శాఖ అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. తమ కళ్ల ముందే అంతా జరుగుతున్నా వారికేమీ పట్టడం లేదు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణా సమాచారం తెలిసినపుడు ఆ శాఖ అధికారులకు ఫోన్‌ చేసినా స్పందించడం లేదు. సెలవు రోజుల్లో అయితే పౌరసరఫరాల శాఖ అధికారుల తీరు మరీ దారుణం.

–చాకలి నూకరాజు, ఆర్టీఐ యాక్టివిస్టు, యలమంచిలి

జిల్లాలో యలమంచిలి, చోడవరం, నర్సీపట్నం, అనకాపల్లి, పాయకరావుపేట, కె.కోటపాడు ఏరియాల్లో భారీగా చౌక బియ్యం కొనుగోలు చేసే రైసుమిల్లుల యజమానులు ఉన్నారు. దళారులు, డీలర్ల నుంచి కేజీ బియ్యం రూ. 16 నుంచి రూ.18లకు కొని కొనుగోలు చేసి తమ రైసు మిల్లుల్లో నిల్వ చేస్తున్నారు. ఆపై రైసు మిల్లుల యజమానులు, కొంతమంది ఎగుమతిదారులు కిలోకు రూ.30 వరకు సంపాదిస్తున్నారు. విదేశాలకు ఎగుమతి చేసే బియ్యం కిలో రూ.40 వరకు ఉంటోంది. డీలర్లు, రైసు మిల్లుల యజమానులు, ఇతర అక్రమార్కులపై 6 ఏ కేసులు నమోదైనా కఠిన చర్యలు తీసుకోవట్లేదు. పౌరసరఫరాల శాఖ అధికారుల డొల్లతనంతో టన్నుల్లో రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ చేసి, కాకినాడ పోర్టు, చేపల చెరువులు, కోళ్ల ఫారాలకు తరలించి జేబులు నింపుకొంటున్నారు. రేషన్‌ బియ్యాన్ని నిల్వ చేసే రైసు మిల్లుల్లో బియ్యం నిల్వల తనిఖీలు, రికార్డులను తరచుగా తనిఖీ చేస్తే రేషన్‌ బియ్యం మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయవచ్చు.

రెచ్చిపోతున్నరేషన్‌ మాఫియా 1
1/2

రెచ్చిపోతున్నరేషన్‌ మాఫియా

రెచ్చిపోతున్నరేషన్‌ మాఫియా 2
2/2

రెచ్చిపోతున్నరేషన్‌ మాఫియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement