9న నియోజకవర్గ విజన్ యాక్షన్ యూనిట్ల ప్రారంభం
తుమ్మపాల: ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న విజన్ యాక్షన్ యూనిట్లను ఈ నెల 9న ప్రారంభించనున్నామని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. అధికారులు ఇందుకు తగ్గ ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి శనివారం వీడియో కాన్ఫరెనన్స్ ద్వారా ఆమె నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల అభివృద్ధి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ విజన్ యాక్షన్ యూనిట్లకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే చైర్మన్‌గా వ్యవహరిస్తారని, నియోజకవర్గ ప్రత్యేక అధికారి, కేటాయించిన ఐదుగురు సిబ్బంది యూనిట్లో ఉంటారన్నారు. యూనిట్లకు కేటాయించిన సిబ్బంది వెంటనే రిపోర్టు చేయాలని ఆదేశించారు. జిల్లాస్థాయి, నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న విజన్ యాక్షన్ యూనిట్లు సోమవారం నుంచి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు కొనసాగించాలన్నారు. యూనిట్ ఏర్పాటుకు కావలసిన వసతి, ఫర్నిచర్, కంప్యూటర్లు సమకూర్చవలసిందిగా మండల అభివృద్ధి అధికారులను ఆమె ఆదేశించారు. జిల్లా ప్రణాళిక అధికారి జి.రామారావు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల అభివృద్ధి అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.


