కేసు తేలేదాకా..అభివృద్ధి ఎలా..?
రాంబిల్లి(అచ్యుతాపురం): ఎవరో ఒక్కరు చేసిన ఫిర్యాదుకు నాలుగు గ్రామాల ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. తక్షణమే తమ గ్రామాలకు ఎన్నికలు నిర్వహించాలని, సాంకేతికంగా అవరోధంగా ఉన్న కోర్టు కేసులు పరిష్కరించాలని రాంబిల్లి మండలానికి చెందిన అప్పారాయుడిపాలెం, భోగాపురం ప్రజలు జిల్లా కలెక్టర్‌ను ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా సోమవారం కోరారు. వివరాలివి...
టీడీపీ నేత నిర్వాకం వల్లే..
రాంబిల్లి మండలం పంచదార్ల పంచాయతీ పరిధిలో పంచదార్ల, ధారపాలెం, భోగాపురం, అప్పారాయుడిపాలెం ఉండేవి. ఆయా గ్రామాల ఓటర్ల సంఖ్య సుమారు 2,500. ఈ నాలుగు గ్రామాల్ని పరిపాలన సౌలభ్యం కోసం రెండు పంచాయతీలు చేయాలని నిర్ణయించారు. భౌగోళిక స్థితిగతులకు అనుగుణంగా పంచదార్ల,ఽ ధారపాలెం గ్రామాల్ని ఒక పంచాయితీగా, అప్పారాయుడిపాలెం, భోగాపురం గ్రామాల్ని ఒక పంచాయతీగా ఏర్పాటు చేయాలని నిర్ణయించి గ్రామ సభలు నిర్వహించారు. అప్పారాయుడిపాలెం గ్రామం పంచదార్లకు 3 కిలోమీటర్ల దూరంలో ఉందని ఆర్‌అండ్‌బీ శాఖ ధృవీకరించింది. గ్రామసభ ఆమోదాన్ని పరిగణిస్తూ అభ్యంతరాలుంటే పది రోజుల్లోగా ఫిర్యాదు చేయాలని పంచాయతీ విస్తరణాధికారి విభాగం సూచించింది. అయితే ఈ ప్రతిపాదనలు రుచించని వారు అప్పట్లో కోర్టుని ఆశ్రయించారు. దీనిలో టీడీపీ నేత హస్తముందనేది స్థానికుల ఆవేదన. దీంతో 2020 నుంచి నాలుగు గ్రామాల్లో ముఖ్య పంచాయతీకి పాలకులు లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు నాలుగు గ్రామాలకు కలిపి సుమారు రూ. 56 లక్షలు ఆగిపోయాయి. రోడ్లు, మంచి నీటి సరఫరా, పారిశుధ్యం పడకేశాయి. నాలుగేళ్లు గడిచినా తమ గ్రామాల ఏర్పాటుకు సంబంధించిన కేసు పెండింగ్‌లో ఉన్నందున ఎన్నికలు జరగలేదని, వెంటనే కోర్టు కేసుల్ని పరిష్కరించాలని ఆయా గ్రామాలకు చెందిన పలువురు జిల్లా కలెక్టర్‌కు పీజీఆర్‌ఎస్ ద్వారా మొరపెట్టుకున్నారు.
సందిగ్ధంలో నాలుగు గ్రామాలు
2020 తర్వాత జరగని స్థానిక ఎన్నికలు
విడుదల కాని 15వ ఆర్థిక సంఘం నిధులు
తమ సమస్య పరిష్కరించాలనిపీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు వినతి


