
ప్రాణం తీసిన ఆన్‌లైన్ బెట్టింగ్
● అప్పుల బాధతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
నక్కపల్లి : నక్కపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అప్పుల బాధతో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం తుని రైల్వే పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నక్కపల్లికి చెందిన కొల్నాటి రమణబాబు(33) సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల నుంచి ఇంటి వద్ద నుంచే విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతనికి ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు చేసే అలవాటు ఉంది. ఈ బెట్టింగ్‌ల కారణంగా తను సంపాదించిన జీతాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌లకు పాల్పడే వాడు. ఈ బెట్టింగ్‌ల వల్ల సంపాదించిన సొమ్మంతా పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడు. చేసిన అప్పులు తీర్చాలని ఒత్తిడి రావడంతో ఆదివారం నర్సీపట్నం, రేగుపాలెం డౌన్‌లైన్ ట్రాక్‌పై రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్దానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న రైల్వేపోలీసులు సంఘటన స్దలానికి చేరుకుని అతని వద్ద లభించిన సెల్‌ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నక్కపల్లిలో ఉండే ఇతని కుటుంబం కొన్నాళ్ల క్రితమే ఉద్దండపురం గ్రామానికి వలస వెళ్లి అక్కడ కాఫీ హోటల్ నిర్వహిస్తూ జీవిస్తున్నట్టు తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తుని ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ జి శ్రీనివాసరావు తెలిపారు.