పూల సాగుపై ఆశలు పెట్టుకున్న గిరిజన రైతులకు ఈ ఏడాది ఆరంభంలో నిరాశే ఎదురైంది. కనీసం కోత కూలి కూడా దక్కని దుస్థితి నుంచి ఇప్పుడు కాసుల వర్షం కురిసే స్థాయికి పరిస్థితి మారింది. దీపావళి నుంచి ఒక్కసారిగా పెరిగిన బంతిపూల ధరలు రైతుల్లో కొత్త ఆనందాన్ని నింపుతున్నాయి. కార్తీక మాసం డిమాండ్‌తో మన్యం
బంతికి మళ్లీ మహర్దశ పట్టింది.
సాక్షి, పాడేరు: గత రెండు నెలలుగా ధరలు లేక నష్టాలను చవిచూసిన గిరిజన బంతిపూల రైతులకు దీపావళి పండగ నుంచి మంచి రోజులు వచ్చాయి. కార్తీక మాసం ప్రారంభం కావడంతో మన్యం బంతిపూలకు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. మరోవైపు ఒడిశా వ్యాపారులు సైతం పూలను కొనుగోలు చేసి కొరాపుట్ జిల్లాకు తరలిస్తుండటంతో గిరాకీ మరింత పెరిగింది. దీంతో వ్యాపారులు పోటీపడి ధరలు పెంచి పూలను కొనుగోలు చేస్తున్నారు.
రూ.10 నుంచి రూ.300కు..
సీతమ్మకాటుక రకం బంతిపూలకు ఏటా మైదాన ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. పాడేరు, హుకుంపేట, జి.మాడుగుల, పెదబయలు, డుంబ్రిగుడ మండలాల్లో సుమారు 200 ఎకరాల్లో గిరిజన రైతులు బంతిపూల సాగు చేస్తున్నారు. ఈ పూల తోటల ద్వారా ఒక్కో రైతుకు ఏటా రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఆదాయం సమకూరుతుంది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్‌లో పూల సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఆశించిన ధరలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీసం పూలు కోసి మార్కెట్‌కు తరలించిన కూలి కూడా గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొంది.
● దూర ప్రాంతాల నుంచి పాడేరు మార్కెట్‌కు బుట్టల్లో పూలను మోసుకురావడం ఎంతో కష్టమైనప్పటికీ, ధరలు లేకపోవడంతో మొన్నటి వరకు బుట్ట పూలను రూ.10 నుంచి రూ.50లోపే విక్రయించేవారు. మైదాన ప్రాంతాల వ్యాపారులు కూడా కొనుగోళ్లకు ఆసక్తి చూపేవారు కాదు. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది దసరా పండగ సమయంలోనూ బుట్ట పూలను కేవలం రూ.30కే కొనుగోలు చేశారు. సాధారణంగా దసరా సమయంలో బుట్ట ధర రూ.200 దాటుతుందని, ఈసారి ఇంత తక్కువ ధరకు విక్రయించడం ఇదే తొలిసారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
● దీపావళి పండగకు ముందు రోజు నుంచి పరిస్థితి ఒక్కసారిగా మారింది. వ్యాపారులు పోటీపడి బంతిపూల కొనుగోళ్లు ప్రారంభించారు. ప్రస్తుతం పూల నాణ్యతను బట్టి ఒక్కో బుట్టను రూ.150 నుంచి రూ.300 వరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో గిరిజన రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. రోజుకు పది బుట్టల వరకు పూలను సేకరించే రైతులకు మార్కెట్‌లో విక్రయాల ద్వారా రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఆదాయం లభిస్తోంది.
● కార్తీక మాసం నేపథ్యంలో ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో మన్యం బంతిపూలకు గిరాకీ పెరగడంతో గిరిజన రైతులకు ఆదాయం సమకూరుతోంది. కార్తీక మాసం ముగిసే వరకు పూల వ్యాపారం జోరుగా సాగుతుందని వ్యాపారులు భావిస్తున్నారు. పాడేరు పాత బస్టాండ్ మార్కెట్‌లో కొనుగోలు చేసిన పూలను వ్యాపారులు వ్యాన్ల ద్వారా ఎప్పటికప్పుడు మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో రైతులతోపాటు పూల వ్యాపారులకూ మంచి ఆదాయం లభిస్తోంది.
కార్తీకంతో పెరిగిన గిరాకీ
రైతులకు కాసుల పంట
ఒడిశాకూ మన్యం పూలు ఎగుమతి
పోటీపడి కొంటున్న వ్యాపారులు
దీపావళి నుంచి పెరిగిన ధర
పూల ధర పెరగడంతో ఆదాయం
బంతిపూల దిగుబడులు ప్రారంభమైనప్పటి నుంచి బుట్ట రూ.50లోపే అమ్ముకోవడంతో ఆదాయం లేక ఇబ్బందులు పడ్డాం. దసరా సమయంలోనూ ధర పెంచలేదు. అయితే గత నాలుగు రోజులుగా బుట్ట పూలను రూ.200కిపైగా కొనుగోలు చేస్తుండటంతో మంచి ఆదాయం లభిస్తోంది.
– తమర్భ అన్నపూర్ణ,
డోకులూరు, పాడేరు మండలం


