ఆచారమే.. ఆరోగ్యమనే నమ్మకం | - | Sakshi
Sakshi News home page

ఆచారమే.. ఆరోగ్యమనే నమ్మకం

Nov 12 2026 12:25 AM | Updated on Nov 12 2026 12:25 AM

● ఘనంగా అనురాధ నక్షత్రం వేడుక

● చిన్నారులకు సావడి స్నానం

● తరతరాలుగా కొనసాగుతున్నసంప్రదాయం

పెదబయలు: గిరిజన ప్రాంతంలో తెగల ఆచార వ్యవహారాలు, పండగలు జరుపుకునే పద్ధతులు ప్రత్యేకంగా, ఆసక్తికరంగా ఉంటాయి. ఈ క్రమంలో దీపావళి పండగ అనంతరం వచ్చే అనురాధ నక్షత్రం రోజున వాల్మీకి తెగకు చెందిన గిరిజనులు ‘దీపావళి సావడి స్నానం’ వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పెదబయలు మండలం గోమంగి పంచాయతీ పరిధిలోని కరుగొండ, రూడకోట పంచాయతీ పరిధిలోని కొత్త రూడకోట గ్రామాల్లో గురువారం ఉదయం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

● గ్రామంలోని పుట్టినప్పటి నుంచి మూడేళ్లలోపు వయస్సు కలిగిన పిల్లలకు జన్మదోషాలు, గ్రహదోషాలు తొలగిపోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఇంటి నుంచి బిందెల్లో నీటిని తీసుకొచ్చి గ్రామపెద్ద ఇంటి ఆవరణలోని సావడి వద్ద ఉంచారు. ఆ నీటిలో పసుపు, ఆముదం నూనె కలిపి, ప్రతి నీటి బిందెను పీపిరికాయలతో అలంకరించారు. అనంతరం గ్రామపూజారి పిల్లలకు దిష్టి తీసి సావడి స్నానం చేయించారు. తల్లిదండ్రుల కోరిక మేరకు స్నానానికి ముందుగా గ్రామ సావడి వద్ద పిల్లలకు తలనీలాలు సమర్పించారు.

● పిల్లలకు స్నానాలు చేయించిన అనంతరం గ్రామంలోని ఏడుగురు పెద్దలు స్నానాలు ఆచరించారు. ఆ తర్వాత గ్రామపెద్దల ఆశీర్వాదం తీసుకుని గ్రామస్తులంతా కలిసి విందు భోజనం చేశారు. చిన్నారులకు దీపావళి సావడి స్నానం చేయించడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారని, గ్రామంలోని కుటుంబాలన్నీ ఐకమత్యంతో కలిసిమెలిసి ఉంటాయని గిరిజనుల నమ్మకం. పూర్వీకుల ఆచారం ప్రకారం ప్రతి ఏటా దీపావళి అనంతరం వచ్చే అనురాధ నక్షత్రం రోజున ఈ వేడుకను నిర్వహిస్తున్నారు.

గ్రహదోషాలు తొలగిపోతాయి

మూడేళ్లలోపు వయస్సున్న పిల్లలకు దీపావళి పండగ అనంతరం కార్తీక మాసంలో వచ్చే అనురాధ నక్షత్రం రోజున సావడి స్నా నం చేయించడం పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనివల్ల పిల్లలకు జన్మదోషాలు, గ్రహదోషాలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారని మా నమ్మకం.

– గడుతూరి సూర్యనారాయణ,

గ్రామపెద్ద, కరుగొండ

ఆచారం కొనసాగిస్తున్నాం

జిల్లాలోని వాల్మీకి తెగకు చెందిన గిరిజనులు నివసించే గ్రా మాల్లో దీపావళి పండగ అనంతరం పిల్లలకు సావడి స్నానం చేయించడం పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. ఏటా ఈ వేడుకను నిర్వహిస్తున్నాం. గ్రామానికి చెందిన పిల్లలు ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఈ కార్యక్రమం కోసం తప్పనిసరిగా స్వగ్రామానికి తీసుకొస్తారు. గ్రామస్తులంతా ఐకమత్యంతో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం.

– గడుతూరి మన్మధరావు, గ్రామపెద్ద, కరుగొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement