సందర్శించిన జైకా బృందం
సాక్షి, పాడేరు: జిల్లాలో గిరిజనాభివృద్ధి కార్యక్రమాల అమలును పరిశీలించేందుకు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) బృందం బుధవారం పర్యటించింది. పాడేరుతో పాటు పలు ప్రాంతాల్లో వ్యవసాయం, ఉద్యానవన పంటలు, కాఫీ తోటలు, మిరియాల పాదులు, ఇతర వాణిజ్య పంటల సాగు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలను బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. జపాన్‌కు చెందిన జైకా బృందం నాయకురాలు యుమికో ఒనిషి, ప్రాథమిక మౌలిక సదుపాయాల నిపుణుడు శ్రీనాథ్, వ్యవసాయ రంగ నిపుణుడు అభిజిత్ మొహపాత్ర జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. వైద్య, ఆరోగ్య కార్యక్రమాలతో పాటు డ్రోన్ వ్యవస్థ ద్వారా అత్యవసర సమయాల్లో మందుల రవాణా విధానాన్ని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ టి. నిశాంతి జిల్లాలోని ప్రత్యేక భౌగోళిక పరిస్థితులు, సహజ వనరులు, వ్యవసాయం, అరకు కాఫీ, గిరిజన సంస్కృతి, పర్యాటక రంగం తదితర అంశాలను జైకా బృందానికి వివరించారు. అలాగే 20 ఆదర్శ గ్రామాల అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలపై సమగ్రంగా వివరించారు. ప్రభుత్వ పథకాలన్నీ ప్రతి గిరిజన కుటుంబానికి చేరేలా చూడటమే జిల్లా అభివృద్ధి వ్యూహమని ఆమె పేర్కొన్నారు.


