వైద్యసేవలకు తొలి అడుగు | - | Sakshi
Sakshi News home page

వైద్యసేవలకు తొలి అడుగు

Nov 12 2026 12:25 AM | Updated on Nov 12 2026 12:25 AM

● వైద్య కళాశాల రిటైర్ట్‌ ప్రిన్సిపాల్‌హేమలతాదేవి

● 100 మంది విద్యార్థులకు వైట్‌కోట్‌

సాక్షి, పాడేరు: వైద్య విద్యలోకి అడుగుపెట్టిన విద్యార్థుల జీవితంలో వైట్‌కోట్‌ వేడుక ఎంతో ప్రత్యేకమైన ఘట్టమని పాడేరు మెడికల్‌ కళాశాల తొలి ప్రిన్సిపాల్‌ (రిటైర్డ్‌) డాక్టర్‌ డి.హేమలతాదేవి అన్నారు. తెల్లటి కోటు కేవలం దుస్తులు మాత్రమే కాదని, స్వచ్ఛత, నిజాయితీ, బాధ్యతతో కూడిన మానవ సేవకు ప్రతీక అని పేర్కొన్నారు. బుధవారం పాడేరు మెడికల్‌ కళాశాలలో 2026 బ్యాచ్‌ ఎంబీబీఎస్‌ విద్యార్థులకు వైట్‌కోట్‌ వేడుకను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్‌ హేమలతాదేవి జ్యోతి ప్రజ్వలన చేసి, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బుజ్జిబాబు, ఇతర వైద్యులతో కలిసి 100 మంది విద్యార్థులకు వైట్‌కోట్లు తొడిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతమైన పాడేరులో వైద్య కళాశాల ఏర్పాటు ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్నదన్నారు. ఇక్కడ వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు గిరిజన ప్రజల జీవన పరిస్థితులు, ఆరోగ్య సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని సేవ చేసే గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్రమశిక్షణతో చదువుకోవడంతో పాటు శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పాల్గొనాలని సూచించారు. రోగుల పట్ల ప్రేమ, సహనం, కరుణతో వ్యవహరిస్తూ మంచి వైద్యులుగా, మంచి మనుషులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

విద్యార్థుల్లో ఉత్సాహం

ఎంతో కష్టపడి చదివి నీట్‌లో విజయం సాధించి వైద్య కళాశాలలో సీటు పొందిన విద్యార్థులు తొలిసారిగా వైట్‌కోట్లు ధరించడంతో వారిలో ఉత్సాహం నెలకొంది. తమ పిల్లలు వైద్యులుగా ఎదిగే ప్రయాణంలో తొలి అడుగు వేయడాన్ని చూసి తల్లిదండ్రులు ఆనందోత్సాహాలతో సందడి చేశారు. అనంతరం ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బుజ్జిబాబు విద్యార్థులతో తల్లిదండ్రుల సమక్షంలో ప్రతిజ్ఞ చేయించారు. వైద్య వృత్తి ప్రమాణాలను పాటిస్తామని, క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తామని, రోగుల గోప్యతను కాపాడుతామని, నిరంతరం వైద్య పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. కులమతాలకు అతీతంగా ఎలాంటి వివక్ష లేకుండా రోగులకు సేవ చేస్తామని ప్రతినబూనారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.శ్రీనివాసరావు, వైస్‌ ప్రిన్సిపాళ్లు డాక్టర్‌ పి.వెంకటేశ్వర్లు, డాక్టర్‌ ఎన్‌.అనురాధ, డాక్టర్‌ బి.శ్రీకాంత్‌రెడ్డి, వైద్య నిపుణులు డాక్టర్‌ సురేష్‌రెడ్డి, ఇతర వైద్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement