వేకువజాము నుంచే
గ్రామాల్లో అభ్యర్థుల పర్యటన
సాక్షి, పాడేరు: ఈ నెల 5న జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి చివరి రోజు మంగళవారం వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం హోరెత్తింది. జిల్లాలోని 11 జెడ్పీటీసీ, 172 ఎంపీటీసీ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులంతా వేకువజాము నుంచే తమ పరిధిలోని గ్రామాలను సందర్శించి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నాయకత్వం, ‘రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే’ అన్న నినాదాలతో మన్యమంతా మార్మోగింది. మండల కేంద్రాలు, వారపు సంతలు, గ్రామాల్లో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టి ప్రచారాన్ని హోరెత్తించాయి.
జగనన్న నాయకత్వంలోనే గిరిజనాభివృద్ధి :
అరకు ఎంపీ గుమ్మా తనూజరాణి
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోనే గిరిజనుల అభివృద్ధి సాధ్యమని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి అన్నారు. హుకుంపేట మండలంలోని దుర్గం, ఓల్డా, రాప ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఒంటుబు ప్రియాంక, ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుని బ్యాలెట్ నమూనా కరపత్రాలను పంపిణీ చేశారు. బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జిల్లాలోని 11 జెడ్పీటీసీ, 172 ఎంపీటీసీ స్థానాల్లో సమర్థులైన అభ్యర్థులను వైఎస్సార్సీపీ బరిలో నిలిపిందన్నారు. అన్ని వర్గాల ఓటర్లు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి తమ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైఎస్సార్సీపీ పాలనలో గిరిజనులకు ఎంతో మేలు జరిగిందని, గతంలో ఆ పార్టీ ప్రజాప్రతినిధుల హయాంలో గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. మరోసారి జెడ్పీ చైర్మన్ పదవితో పాటు జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తే గిరిజన గ్రామాల సమగ్ర అభివృద్ధికి అవకాశం ఉంటుందన్నారు. కూటమి పార్టీల ప్రలోభాలకు, మాయమాటలకు ఓటర్లు మోసపోవద్దని, వైఎస్సార్సీపీ అభ్యర్థులను మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం నేత చెట్టి వినయ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వర్షంలోనూ జోరుగా ప్రచారం
కొయ్యూరు: వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా కొయ్యూరు జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారానికి చివరి రోజైన మంగళవారం మండలంలోని కొమ్మిక, శరభన్నపాలెం, రావణాపల్లి మూడు సెగ్మెంట్లలో విస్తృతంగా పర్యటించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనతో పాటు 14 మంది ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కూటమి పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించాలని కోరారు. ఈ నెల 5న జరిగే పోలింగ్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో రావణాపల్లి సెగ్మెంట్ అభ్యర్థి రాజులమ్మ, కొమ్మిక అభ్యర్థి లోవరాజు, శరభన్నపాలెం అభ్యర్థి రాజేశ్వరి పాల్గొన్నారు.
ప్రచారంలో జోరు
గత ఆరు రోజులుగా సాగిన ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి. ఈ నెల 1న కాకరపాడు నుంచి కొయ్యూరు వరకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల కూటమి ప్రభుత్వంపై సంధించిన విమర్శనాస్త్రాలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి.
వైఎస్సార్సీపీతోనే అభివృద్ధి సాధ్యం :
ముంచంగిపుట్టు జెడ్పీటీసీ అభ్యర్థి సుభద్ర
ముంచంగిపుట్టు: గ్రామాల ప్రగతి వైఎస్సార్సీపీతోనే సాధ్యమవుతుందని మాజీ జెడ్పీ చైర్పర్సన్, ఆ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి జల్లిపల్లి సుభద్ర అన్నారు. మంగళవారం మండలంలోని సుజనకోట పంచాయతీలో ఎంపీటీసీ అభ్యర్థి మజ్జి సుబ్బలక్ష్మితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లను కోరారు. గ్రామస్తులతో కలిసి మత్స్యగెడ్డ ఒడ్డున ఉన్న గంగమ్మతల్లి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కించాయిపుట్టు పంచాయతీలోని పలు గ్రామాల్లో ఎంపీటీసీ అభ్యర్థి చికలమ్మతో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రజలకు మేలు చేసే వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. బంగారుమెట్ట పంచాయతీ పరిధిలోని సరియాపల్లిలో ఎంపీటీసీ అభ్యర్థి జగన్నాథంతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సుభద్ర మాట్లాడుతూ పార్టీలకతీతంగా పేదలందరికీ సంక్షేమ పాలన అందాలంటే వైఎస్సార్సీపీని ఆదరించాలని కోరారు. మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టిన చంద్రబాబు ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. రోజురోజుకూ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో సామాన్యుల జీవ నం భారంగా మారిందని పేర్కొన్నారు. ఈ నెల 5న జరిగే మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఓటర్లు తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 14 ఎంపీటీసీ స్థానాలతో పాటు జెడ్పీటీసీ స్థానాన్ని గెలుచుకునేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


