● మరోసారి ఫ్యాన్ గాలి
● ఎమ్మెల్సీ కుంభా రవిబాబు
● అరకులో వైఎస్సార్సీపీ ప్రచార ర్యాలీ
అరకులోయ టౌన్ (డుంబ్రిగుడ): 2014, 2021 ఎన్నికల్లో జెడ్పీటీసీ స్థానాలను కై వసం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి జెడ్పీటీసీతో పాటు 14 ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించేందుకు సిద్ధంగా ఉందని ఎమ్మెల్సీ డాక్టర్ కుంభ రవిబాబు అన్నారు. ఆంధ్రా ఊటీ అరకులోయలో ఫ్యాన్ గాలి మరోసారి వీచే సమయం దగ్గరలో ఉందని పేర్కొన్నారు. అరకులోయ టౌన్‌షిప్‌లోని స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. జెడ్పీటీసీ అభ్యర్థి కమ్మిడి అశోక్, ఎంపీటీసీ అభ్యర్థులతో పాటు వైఎస్సార్సీపీ మద్దతుదారులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రచార రథంపై ఏర్పాటు చేసిన పాటలతో గిరిజన మహిళలు, యువత ఉత్సాహంగా నృత్యాలు చేశారు. పార్టీ జెండాలు చేతబట్టి, సంప్రదాయ ధింసా నృత్యాలతో సందడి చేశారు. వీధివీధినా వైఎస్సార్సీపీ జెండాలు కనిపించాయి. ఈ నెల 5న జరిగే ఎన్నికల్లో జెడ్పీటీసీ అభ్యర్థి కమ్మిడి అశోక్‌తో పాటు ఎంపీటీసీ అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్సీ రవిబాబు ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శెట్టి రోషిణి, మండల పార్టీ అధ్యక్షుడు స్వాభి రామూర్తి, ఉపాధ్యక్షుడు పి. విజయ్‌కుమార్, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి పి. చిన్నారావు, జిల్లా ఎస్టీ సెల్ కార్యదర్శి శెట్టి అప్పాలు, ఎంపీటీసీ అభ్యర్థులు పి.బి. రంభ, పి. శాంతి, కె. శిరీష, కె. బాలరాజు, పురుషోత్తం, సుక్రయ్య, జి. ప్రసాద్, కె. బంగార్రాజు, పి. బుల్లమ్మ, జి. నిర్మల, మోహన్‌రావు, బుటికి, స్వామి, కోగేశ్, రాజ్‌కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు.


