అభివృద్ధి పరవళ్లు.. సంక్షేమ వెలుగులు | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పరవళ్లు.. సంక్షేమ వెలుగులు

Nov 4 2026 1:50 AM | Updated on Nov 4 2026 1:50 AM

జెడ్పీ చైర్‌పర్సన్‌గా మన్యం రూపురేఖలు మార్చిన జల్లిపల్లి సుభద్ర
ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేసిన జల్లిపల్లి సుభద్ర మరోసారి ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. ముంచంగిపుట్టు జెడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆమెకు గతంలో మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులే ప్రధాన ప్రచారాస్త్రాలుగా మారాయి. రూ.30 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం నుంచి మారుమూల గిరిజన గ్రామాలకు తాగునీరు, రహదారులు, విద్యుత్‌ సౌకర్యాలు కల్పించడం వరకు తన హయాంలో జరిగిన పనులు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమవుతున్నాయి. మంగళవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడిన నేపథ్యంలో.. గతంలో ఆమె చేపట్టిన అభివృద్ధి పనులు, నెరవేర్చిన హామీలు, అసంపూర్తిగా మిగిలిన పనులపై ప్రత్యేక కథనం.

ముంచంగిపుట్టు: ఉమ్మడి విశాఖ మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర మరోసారి ముంచంగిపుట్టు జెడ్పీటీసీ బరిలో నిలిచారు. గతంలో జెడ్పీటీసీగా గెలుపొంది ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేసిన అనుభవంతో మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆమె హయాంలో ముంచంగిపుట్టు మండలానికి సుమారు రూ.30 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా మారుమూల గిరిజన గ్రామాల్లో తాగునీరు, రహదారులు, డ్రైనేజీ సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యమిచ్చారు. మరోవైపు విద్య, వైద్యం, రవాణా రంగాల్లోనూ పలు సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు.

గ్రామీణ మౌలిక వసతులకు ప్రాధాన్యం

మండలంలోని 23 పంచాయతీల పరిధిలో ఉన్న 376 గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన ప్రధాన సవాలుగా ఉంది. ఈ నేపథ్యంలో సుభద్ర తన పదవీకాలంలో 78 గ్రామాల్లో తాగునీటి బోర్లు, 54 గ్రామాల్లో సీసీ రోడ్లు, 26 గ్రామాల్లో డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టినట్లు వివరాలు తెలియజేస్తున్నాయి. పలు గ్రామాల్లో సామాజిక భవనాలు, వంటషెడ్ల నిర్మాణాలతో పాటు తారురోడ్ల పనులు కూడా చేపట్టారు.

● మండల కేంద్రంలో అంబేడ్కర్‌ పార్కు సుందరీకరణ, అధ్వానంగా ఉన్న చెరువు అభివృద్ధి, నాలుగు రోడ్ల కూడలిలో ప్రయాణికుల కోసం బస్‌ షెల్టర్‌ నిర్మాణం వంటి పనులు చేపట్టారు. గిరిజన ఉద్యోగుల సంఘం భవనాన్ని పూర్తి చేయడంతో పాటు శాఖా గ్రంథాలయానికి భవన సౌకర్యం కల్పించారు. మండల ప్రజా పరిషత్‌ నూతన భవనానికి శంకుస్థాపన చేయగా, జెడ్పీ అతిథిగృహ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.

విద్య, వైద్య రంగాలపై దృష్టి

స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పదేళ్లకు పైగా విద్యార్థినులు ఎదుర్కొంటున్న వసతి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. గిరిజన ప్రాంతాల నుంచి విశాఖ కేజీహెచ్‌కు వచ్చే రోగులను పరామర్శించడం, మెరుగైన వైద్య సేవలు అందేలా చూడటంతో పాటు అత్యవసర సమయాల్లో రోగుల తరలింపునకు వాహనాలు ఏర్పాటు చేసిన సందర్భాలున్నాయి. రంగబయలు పంచాయతీ గొబ్బరపడకు చెందిన నిరుపేద గిరిజన కుటుంబాలకు చెందిన 30 కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం కోసం సొంత నిధులతో రేకులు అందించడం, బంగారుమెట్ట పంచాయతీలో విద్యుత్‌ సౌకర్యం లేని గ్రామానికి విద్యుత్‌ వెలుగులు తీసుకొచ్చేందుకు కృషి చేయడం కూడా ఆమె హయాంలో చేపట్టిన పనుల్లో ఉన్నాయి.

రవాణా, పర్యాటక అభివృద్ధికి ప్రాధాన్యం

విశాఖపట్నం, మధురవాడ నుంచి దొడిపుట్టు వరకు ఆర్టీసీ బస్సు సర్వీసు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆమె కృషి చేశారు. గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యాల కొరతను గుర్తించి మరిన్ని గ్రామాలకు బస్సు సర్వీసులు విస్తరించాల్సిన అవసరాన్ని గుర్తించారు.

● ముంచంగిపుట్టు జెడ్పీటీసీగా మరోసారి అవకాశం లభిస్తే మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఆస్పత్రిగా ఆధునికీకరించడం, పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బందిని నియమించడం తన ప్రాధాన్యతలుగా ఆమె ముందుంచుతున్నారు. సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం, గిరిజన మత్స్యకారులకు వలలు, బోట్లు అందించడం, ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్‌ వర్కర్ల నియామకానికి కృషి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

● జీవో నంబర్‌ 3 అమలు, 1/70 చట్టం పరిరక్షణ, గిరిజనులకు ఉద్యోగ అవకాశాల కల్పన కోసం పోరాడాలని భావిస్తున్నారు. సుజనకోట మత్స్యగెడ్డ, జడిగూడ, జోలాపుట్టు, బురదగుంట ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయడం, అవసరమైన వసతులు కల్పించడం, మారుమూల గ్రామాలకు తాగునీరు, రహదారులు, డ్రైనేజీ సౌకర్యాలు విస్తరించడం ఆమె ముందున్న లక్ష్యాలు. కుమడ, డుడుమ, జోలాపుట్టు, పెదబయలు మార్గాల్లో బస్‌ షెల్టర్ల నిర్మాణం, తారురోడ్లు ఉన్న గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసుల విస్తరణపైనా దృష్టి సారించనున్నారు.

ముంచంగిపుట్టు జెడ్పీటీసీ స్థానం

నుంచి మరోసారి పోటీ

రూ.30 కోట్లతో అభివృద్ధి పనులు

78 గ్రామాలకు తాగునీటి బోర్లు

54 గ్రామాలకు సీసీ రోడ్ల సౌకర్యం

విద్య, వైద్యం, రవాణాపై ప్రత్యేక దృష్టి

గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement