ప్రశాంత ఎన్నికలకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

ప్రశాంత ఎన్నికలకు సర్వం సిద్ధం

Nov 4 2026 1:50 AM | Updated on Nov 4 2026 1:50 AM

సాక్షి, పాడేరు: ఈ నెల 5వ తేదీ గురువారం జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్‌ టి.నిశాంతి తెలిపారు. జిల్లా ఎన్నికల పరిశీలకుడు రోణంకి కూర్మనాథ్‌, జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు ధీరజ్‌ హన్స్‌తో కలిసి మంగళవారం కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి ఎన్నికల ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు.

11 జెడ్పీటీసీ, 172 ఎంపీటీసీ..

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 11 జెడ్పీటీసీ, 172 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 617 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని, 4,98,467 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని పేర్కొన్నారు. వీటిలో 149 సెన్సిటివ్‌, 91 హైపర్‌ సెన్సిటివ్‌ కేంద్రాలుగా పోలీసులు గుర్తించారన్నారు. ఇంటర్నెట్‌ సదుపాయం ఉన్న చోట వెబ్‌కాస్టింగ్‌, అవసరమైన పోలింగ్‌ కేంద్రాల్లో వీడియోగ్రఫీ ఏర్పాటు చేస్తామని, సెన్సిటివ్‌ కేంద్రాల్లో 78 మంది మైక్రో అబ్జర్వర్లు విధులు నిర్వహిస్తారని వివరించారు.

నేడు పోలింగ్‌ సామగ్రి పంపిణీ..

ఈ నెల 4వ తేదీ ఉదయం నుంచి మండల కేంద్రాల్లో పోలింగ్‌ సామగ్రి పంపిణీ చేపడతామన్నారు. ఎన్నికల సిబ్బంది, సామగ్రి తరలింపునకు 103 ఆర్టీసీ బస్సులు, 276 జీపులు, వ్యాన్లు ఏర్పాటు చేశామని, అవసరమైన చోట పోలీసు ఎస్కార్ట్‌ ఉంటుందని తెలిపారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ప్రిసైడింగ్‌ అధికారితో పాటు మరో ఐదుగురు సిబ్బంది విధుల్లో ఉంటారని, మొత్తం 3,702 మంది ఎన్నికల విధులు నిర్వహిస్తారని చెప్పారు. అదనంగా 20 శాతం రిజర్వు సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. 78 మంది జోనల్‌ అధికారులు, 117 మంది రూట్‌ అధికారులను నియమించినట్లు వెల్లడించారు.

గుర్తింపు కార్డు తప్పనిసరి..

ఎన్నికల కమిషన్‌ అనుమతితో 44 మారుమూల, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్‌ నిర్వహిస్తామని, మిగిలిన కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. పోలింగ్‌కు 48 గంటల ముందే ఎన్నికల ప్రచారం నిలిపివేయాలని సూచించారు. ఓటర్లు ఓటు వేసే సమయంలో ఎన్నికల కమిషన్‌ సూచించిన 20 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించాలన్నారు.

పర్యవేక్షణకు ప్రత్యేక యాప్‌..

ఎన్నికల పర్యవేక్షణకు కమిషన్‌ ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను రూపొందించిందని, ప్రతి రెండు గంటలకు పోలింగ్‌ శాతాన్ని తెలుసుకునేందుకు ప్రతి మండలానికి కమ్యూనికేషన్‌ ప్లాన్‌ సిద్ధం చేశామని చెప్పారు. నెట్‌వర్క్‌ సదుపాయం లేని 66 పోలింగ్‌ కేంద్రాలకు కమ్యూనికేటర్లను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్సులకు సీల్‌ వేసి, సాయుధ పోలీసు భద్రత నడుమ స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలిస్తామని తెలిపారు. అక్కడ 24 గంటల పోలీసు భద్రతతో పాటు సీసీ కెమెరాల నిఘా ఉంటుందని, మండల కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

జిల్లాలో 617 పోలింగ్‌ కేంద్రాలు

4,98,467 మంది ఓటర్లు..

3,702 మంది సిబ్బంది

44 మారుమూల కేంద్రాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్‌ ముగింపు

కలెక్టర్‌ నిశాంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement