● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి శ్యామల
● జెడ్పీటీసీ అభ్యర్థి మాధవి తరఫున ప్రచారం
ఉత్సాహంగా బైక్ ర్యాలీ
మాట్లాడుతున్న పార్టీ అధికార ప్రతినిధి శ్యామల, పక్కన మాధవి
కొయ్యూరు: ఎల్‌నినో.. ఎల్లో (పసుపు) నినోగా మారి రాష్ట్రాన్ని నాశనం చేస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల ఎద్దేవా చేశారు. ఎల్లో నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. ఆదివారం కాకరపాడు నుంచి కొయ్యూరు వరకు జెడ్పీటీసీ అభ్యర్థి గొడ్డేటి మాధవి నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. వందలాది మంది పార్టీ కార్యకర్తలు బైక్‌లతో ర్యాలీగా తరలివచ్చారు. గుడ్లపల్లి జంక్షన్ వద్ద కార్యకర్తలను ఉద్దేశించి శ్యామల మాట్లాడుతూ.. చంద్రబాబు ఏమి చేశారని ప్రజలు ఓటు వేయాలో ఆలోచించాలని అన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పటికీ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని విమర్శించారు. గత వైఎస్ జగన్ పాలనకు, ప్రస్తుత చంద్రబాబు కూటమి పాలనకు మధ్య తేడాను పరిశీలిస్తే నిత్యావసర వస్తువుల ధరలు రెట్టింపయ్యాయని ఆరోపించారు. పేదవాడికి నోటికాడి ముద్ద అందడం కూడా గగనంగా మారిందన్నారు. వేల కోట్ల రూపాయల విలువైన భూములను 99 పైసలకే కట్టబెట్టడంలో చంద్రబాబు గొప్ప వ్యక్తిగా మారారని విమర్శించారు. నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామన్న హామీలను ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. జగన్ అన్నకు సోదరిగా ఉన్న మాధవితో పాటు 14 ఎంపీటీసీ సెగ్మెంట్ల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


