పాలనలోనూ కీలక పాత్ర
ముంచంగిపుట్టు: మండలంలోని 23 పంచాయతీల పరిధిలో ఉన్న 14 ఎంపీటీసీ స్థానాల్లో మొత్తం 38,895 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళా ఓటర్లే అధికంగా ఉండటం విశేషం. పురుష ఓటర్లు 18,990 మంది ఉండగా, మహిళా ఓటర్లు 19,903 మంది ఉన్నారు. మొత్తం 14 ఎంపీటీసీ స్థానాల్లో ఏడు స్థానాలను మహిళలకు కేటాయించారు. సుజనకోట, దారెల, కిలగాడ, లక్ష్మీపురం, జోలాపుట్టు, పెదగూడ, బరడ సెగ్మెంట్లలో ఎస్టీ మహిళలకు ఎంపీటీసీ స్థానాలు రిజర్వ్ చేశారు. గత కొన్నేళ్లుగా మండలంలో జెడ్పీటీసీ, ఎంపీపీ పదవులు మహిళలకే కేటాయిస్తూ వస్తున్నారు. దీనికి తోడు ఎంపీటీసీ స్థానాల్లోనూ సగం మహిళలకు రిజర్వ్ కావడంతో మండల పరిషత్ పాలనలో మహిళల ప్రాతినిధ్యం కీలకం కానుంది. స్థానిక పాలనలో మహిళలే దిశానిర్దేశం చేయనున్నారు.


