ముంచంగిపుట్టు: గత వైఎస్సార్సీపీ పాలనలో గ్రామాల్లో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి, ఆలోచించి ఓటు వేయాలని మాజీ జెడ్పీ చైర్పర్సన్, జెడ్పీటీసీ అభ్యర్థి జల్లిపల్లి సుభద్ర అన్నారు. మండలంలోని జర్రెల, జోలాపుట్టు పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో ఆదివారం ఆమెతో పాటు ఎంపీటీసీ అభ్యర్థులు కమల, లక్ష్మి ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి, భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కొన్ని గ్రామాల్లో మహిళలు పనులు చేసుకుంటుండగా వారికి సహకరిస్తూ ప్రచారం సాగించారు. ఈ సందర్భంగా జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, రహదారులు, తాగునీటి సదుపాయాలు మెరుగుపడటంతో పాటు ప్రభుత్వ పాఠశాలలకు కొత్త రూపురేఖలు వచ్చాయని పేర్కొన్నారు. ఇంటివద్దకే రేషన్, పింఛన్లను వాలంటీర్ల ద్వారా అందించేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రజలు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని, ప్రజలకు న్యాయం చేసే వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేసీఎస్ జిల్లా కోఆర్డినేటర్ జగబంధు, వైఎస్సార్సీపీ మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మాజీ జెడ్పీ చైర్ పర్సన్, వైఎస్సార్సీపీ
జెడ్పీటీసీ అభ్యర్థి జల్లిపల్లి సుభద్ర


