ఏడుగురి ప్రాణాలను బలిగొన్న పేలుడు ఘటన.. బాధిత కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. కుటుంబ పెద్దలను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న వారికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం పరిహారం ప్రకటించడంలో జాప్యం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదం జరిగి రెండు రోజులైనా ప్రభుత్వపరంగా భరోసా లభించకపోవడంపై బాధిత కుటుంబాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పేద కార్మికుల ప్రాణాలకు విలువ లేదా? బాధిత కుటుంబాలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానికి లేదా? అన్న ప్రశ్నలు స్థానికంగా చర్చనీయాంశమవుతున్నాయి.
గిరిజనులపై వివక్ష ఎందుకు?
సాక్షి, పాడేరు: అనంతగిరి మండలం పినకోట వద్ద క్వారీలో జిలెటిన్ స్టిక్స్ పేలుడు ఘటనలో మృతిచెందిన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు డిమాండ్ చేశారు. గిరిజనుల పట్ల వివక్ష చూపకుండా మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. ఆదివారం ఆయన ఫోన్లో ‘సాక్షి’తో మాట్లాడుతూ.. పినకోట వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా, వారిలో ఇద్దరు గిరిజనులు ఉన్నారని తెలిపారు. గతంలో విశాఖపట్నం, కాకినాడ ప్రాంతాల్లోని పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడు యాజమాన్యాలు, ప్రభుత్వాల ద్వారా బాధిత కుటుంబాలకు కోట్లాది రూపాయల పరిహారం అందించిన సందర్భాలున్నాయని గుర్తుచేశారు. అలాంటప్పుడు గిరిజనుల విషయంలో ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన ఇంతటి ఘోర ప్రమాదంలో కేవలం కాంట్రాక్టర్ ద్వారా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పరిహారం అందించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మృతిచెందిన ఇద్దరు గిరిజనుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
సాక్షి, పాడేరు: ఏడుగురి ప్రాణాలను బలిగొన్న అనంతగిరి మండలం పీచుపల్లి రోడ్డు పేలుడు ఘటన బాధిత కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఒకవైపు కుటుంబ సభ్యులను కోల్పోయిన దుఃఖం.. మరోవైపు భవిష్యత్తుపై ఆందోళన.. ఈ పరిస్థితుల్లో బాధితులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్థిక భరోసాపై స్పష్టత లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇంతటి ఘోర ప్రమాదం జరిగినా కూటమి ప్రభుత్వం స్పందించిన తీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
రెండు రోజులైనా పరిహారంపై ప్రకటనేదీ?
ప్రమాదం జరిగి రెండు రోజులైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబాలకు పరిహారంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని మైదాన, పారిశ్రామిక ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు, రూ.25 లక్షల వరకు పరిహారం ప్రకటించిన సందర్భాలున్నాయని స్థానికులు గుర్తుచేస్తున్నారు. అయితే జిలెటిన్ స్టిక్స్ పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు మాత్రం ప్రభుత్వపరంగా పరిహారం ప్రకటించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
రోడ్డు కాంట్రాక్టర్ ద్వారా ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించడంతోనే ప్రభుత్వం సరిపెట్టుకుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతటి ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వమే ముందుకొచ్చి అండగా నిలవాలని పలువురు కోరుతున్నారు.
పేద కుటుంబాలకు తీరని నష్టం
ఈ ప్రమాదంలో మృతిచెందిన ఏడుగురిలో ఒకరు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కాగా.. మిగిలిన ఆరుగురూ పొట్టకూటి కోసం పనులకు వచ్చిన కార్మికులు. వీరిలో పెదబయలుకు చెందిన గిరిజనుడు పాంగి చిరంజీవి కూడా ఉన్నారు. రోజువారీ కూలి పనులు, ఉద్యోగాలపై ఆధారపడి జీవించే ఈ కుటుంబాలకు మృతులే ప్రధాన ఆధారంగా ఉన్నారు. ఒక్కసారిగా కుటుంబ సభ్యులను కోల్పోవడంతో వారి జీవనం ప్రశ్నార్థకంగా మారింది.ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం అందించడంతో పాటు, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే పరిహారం ప్రకటనలో జాప్యం జరుగుతోందన్న విమర్శలు ప్రభుత్వ తీరుపై చర్చకు దారితీస్తున్నాయి.
బాధితులకు భరోసా కల్పించాలి
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం ప్రకటించడంతో పాటు, ఆధారాన్ని కోల్పోయిన కుటుంబాలకు అవసరమైన సహాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అండగా నిలవడం, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం అత్యవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
గిరిజనుల ప్రాణాలకు
విలువ ఇవ్వని ప్రభుత్వం
బాధిత కుటుంబాలకు భరోసా కరవు
రెండు రోజులైనా పరిహారం ఊసెత్తని చంద్రబాబు సర్కారు
పేద కుటుంబాల్లో తీరని శోకం
మృతులే కుటుంబాలకు ఆధారం
బాధితుల్లో పెరుగుతున్న అసంతృప్తి
ఆదుకునే వారేరీ?


