రాత్రికి రాత్రే శవ పరీక్షలు
పాడేరు: అనంతగిరి మండలం పినకోట పంచాయతీ పరిధిలోని పీచుమామిడి రోడ్డులో ఆయిల్ మంటలు, జిలెటిన్ స్టిక్స్ భారీ పేలుడు ఘటనలో మృతిచెందిన ఏడుగురి మృతదేహాలకు శనివారం అర్ధరాత్రి పోస్టుమార్టం నిర్వహించారు. ఘటనాస్థలి నుంచి పోలీసులు శనివారం రాత్రి 10 గంటల సమయంలో మృతదేహాలను అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. పాడేరు జిల్లా ఆస్పత్రి, అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రులకు చెందిన వైద్యులు సంయుక్తంగా తెల్లవారుజామున 5 గంటల వరకు పోస్టుమార్టం ప్రక్రియను పూర్తి చేశారు.
ప్రత్యేక వాహనాల్లో స్వస్థలాలకు..
పోస్టుమార్టం పూర్తయిన వెంటనే మృతదేహాలను బంధువులకు అప్పగించి ప్రత్యేక వాహనాల్లో వారి స్వస్థలాలకు తరలించారు. పేలుడు ధాటికి ఛిద్రమైన మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఆదివారం ఉదయం 6 గంటల వరకు మృతదేహాల తరలింపు ప్రక్రియ కొనసాగింది. అరకులోయ సీఐ కోటేశ్వరరావు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది ఈ ప్రక్రియను పర్యవేక్షించారు.
● ఈ ఘోర ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయిని జాగరపు సునీతతో పాటు రోడ్డు పనుల్లో పాల్గొంటున్న డ్రైవర్లు, కూలీలు మృత్యువాత పడ్డారు. మృతుల్లో అనకాపల్లి జిల్లా దేవరాపల్లి గ్రామానికి చెందిన మాన్యాల మణికంఠ, చీడికాడ మండలం సూర్యనారాయణపురానికి చెందిన మండల నారాయణరావు, కడప జిల్లా మల్లేపల్లికి చెందిన ఆదిబోయిన గురుప్రవీణ్కుమార్, పెదబయలుకు చెందిన పాంగి చిరంజీవి, బిహార్‌లోని ఔరంగాబాద్‌కు చెందిన జేసీబీ ఆపరేటర్ టింకు చంద్ర వంశీసింగ్, అసోంకు చెందిన నసీరుద్దిన్ ఉన్నారు. ఈ ఘటన ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.


