సాక్షి, పాడేరు: అనంతగిరి మండలం పీచుమామిడి గ్రామంలోని గిరిజనుల నివాసాలు జిలెటిన్ స్టిక్స్ పేలుడు ధాటికి దెబ్బతిన్నాయి. పేలుడు సంభవించిన ప్రాంతానికి సమీపంలోనే ఈ గ్రామం ఉండటంతో భారీ శబ్దాలు, ప్రకంపనలకు ఇళ్లు దెబ్బతిన్నాయి. గ్రామంలో సుమారు 20 గిరిజన కుటుంబాలు సిమెంట్ రేకులతో కూడిన మట్టి గోడల ఇళ్లలో నివసిస్తున్నాయి. శనివారం ఉదయం సంభవించిన భారీ పేలుళ్ల ధాటికి వాహనాల సామగ్రి ఎగిరిపడి ఇళ్లపై పడింది. దీంతో ఇళ్ల రేకులు ధ్వంసమవగా, మట్టి గోడలకు బీటలు ఏర్పడ్డాయి. చింత నాగేశ్వరరావు, పొట్టన్న, బాలరాజు, బాబురావు, లక్ష్మయ్య, గంగమ్మ, మల్లన్న, జమ్ములు, బాలన్న, దేముడు తదితరుల ఇళ్లు దెబ్బతిన్నాయి. గ్రామంలోని యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం రేకులు, గోడలు కూడా ధ్వంసమయ్యాయి. ఇళ్ల రేకులు దెబ్బతినడంతో వర్షాలు కురిస్తే నివసించలేని పరిస్థితి నెలకొందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోడలకు బీటలు ఏర్పడటంతో ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి నష్టాన్ని అంచనా వేసి, తమకు పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని బాధిత గిరిజన కుటుంబాలు కోరుతున్నాయి.
పక్కా గృహాలు నిర్మించి ఆదుకోవాలని బాధితుల వేడుకోలు


