సీలేరు: గూడెం కొత్తవీధి మండల పరిధిలోని ధారకొండ పంచాయతీ గంగవరం వద్ద కూలిపోయిన వంతెనను శాశ్వతంగా నిర్మించాలని కోరుతూ ఆదివారం గిరిజనులు వాగులో దిగి నిరసన వ్యక్తం చేశారు. 2024లో సంభవించిన విపత్తులో ఈ వంతెన కొట్టుకుపోయింది. నాటి నుంచి అధికారులు నిర్మించిన తాత్కాలిక మార్గం ప్రతి వర్షాకాలంలోనూ ప్రవాహానికి కొట్టుకుపోతుండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. ఫలితంగా ధారకొండ పంచాయతీలోని పెద్ద గంగవరం, చిన్న గంగవరం, గుడారిమామిడి, డి.నర్సమామిడిగొంది, పేట్రాయి సహా 10 గ్రామాలతో పాటు ఆంధ్ర–ఒడిశా సరిహద్దు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. ఆసుపత్రి అత్యవసరాల కోసం గిరిజనులను డోలీల్లో మోస్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రవాహాలు దాటాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గిరిజన సమాఖ్య నాయకుడు పాంగి నాగేశ్వరరావు మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి గంగవరం వాగుపై శాశ్వత వంతెనను నిర్మించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో సీపీఐ మండల కార్యదర్శి భగవాన్, పీసీ కమిటీ అధ్యక్షుడు వంతల చిట్టినాయుడు, బలరామ్, సొమరా, సూరిబాబు పాల్గొన్నారు.
తూరల పునరుద్ధరణ
గంగవరం వద్ద వర్షాలకు దెబ్బతిన్న తాత్కాలిక వంతెన మరమ్మతు పనులను ఆదివారం సాయంత్రం అధికారులు యుద్ధప్రాతిపదికన ప్రారంభించారు. వంతెన కొట్టుకుపోవడంతో గిరిజనులు పడుతున్న ఇబ్బందులపై కథనాలు రావడంతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించి ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్పందించిన కలెక్టర్ సహాయ చర్యలు వేగవంతం చేశారు. జేసీబీల సహాయంతో కొట్టుకుపోయిన శిథిలాలను తొలగించి, తూరల పునరుద్ధరణ జరుగుతోంది.
శాశ్వత వంతెన నిర్మించాలని డిమాండ్!


