సాక్షి, పాడేరు: బాలల బంగారు భవిష్యత్తుకు జీవితంలో తొలి వెయ్యి రోజులు ఎంతో కీలకమని, గిరిజన ప్రాంతాల్లో సీ్త్ర, శిశు సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని రాష్ట్ర సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. సూర్యకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె అల్లూరి జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా అనంతగిరి మండలం కాశీపట్నం, హుకుంపేట మండలం గడుగుపల్లి అంగన్‌వాడీ కేంద్రాలను ఆమె అకస్మాత్తుగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో అందుతున్న సేవలను పరిశీలించి, చిన్నారులతో కాసేపు ఆటపాటలతో సందడి చేశారు. గర్భిణులు, బాలింతలతో నేరుగా మాట్లాడి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పౌష్టికాహారం, సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం, ఆరోగ్యం, తల్లిపాల ప్రాముఖ్యతపై అంగన్‌వాడీ సిబ్బంది నిరంతరం అవగాహన కల్పించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న సవాళ్లను అధిగమిస్తూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయన్నారు. సీడీపీవోలు క్రమం తప్పకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి అంగన్‌వాడీల పనితీరును పర్యవేక్షించాలని ఆదేశించారు. కిశోర బాలికల్లో పోషకాహార లోపం నివారించడంపై, అలాగే కౌమార దశ గర్భధారణ అడ్డుకోవడంపై ప్రత్యేక అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ’లాడిల్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో రూపొందించిన పోషకాహార అవగాహన పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ టి. నిశాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆదిత్య వర్మ, యూనిసెఫ్ ప్రతినిధులు ఖ్యాతి, రేషా దేశాయ్, ఐసీడీఎస్ పిడి ఝాన్సీరామ్ పడాల్ మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


