సాక్షి,పాడేరు: ఏపీలో ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ రంగానికి సంబంధించి 50 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్న గూడెం కొత్తవీధి మండలం ఆర్‌వీ నగర్ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవ వేడుకల’ను ఘనంగా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ టి. నిశాంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో కాఫీ బోర్డు అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 1976లో స్థాపించిన ఆర్‌వీ నగర్ కాఫీ పరిశోధన కేంద్రం గత ఐదేళ్లుగా మన్యంలో కాఫీ తోటల అభివృద్ధికి ఎంతో కృషి చేసిందన్నారు. గిరిజనులలో పోడు వ్యవసాయం తగ్గించి, కాఫీ సాగు వైపు మళ్లించడం ద్వారా వారి సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడిందని కొనియాడారు. స్వర్ణోత్సవ సంబరాల సందర్భంగా కాఫీ ప్రాముఖ్యతను తెలిపే ఫోటో ఎగ్జిబిషన్ స్టాళ్లు, సాధించిన విజయాలు, రైతుల సమగ్ర వివరాల బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. స్వర్ణోత్సవ ప్రధాన సభా నిర్వహణకు స్థల పరిశీలన పూర్తి చేసి, వీఐపీ, వీవీఐపీల విజిట్స్, ఇతర ఏర్పాట్ల సమగ్ర వివరాలను తదుపరి సమావేశంలో సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కేంద్ర కాఫీ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ మురళీధర్, కాఫీ పరిశోధన స్థానం ఇన్‌చార్జ్ సునీల్ బాబు, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, కాఫీ బోర్డు ప్రతినిధులు పాల్గొన్నారు.


