పాడేరు: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అత్యంత పారదర్శకంగా అందేలా చూడాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ఆదేశించారు. పాడేరులో జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులతో మంగళవారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, కొత్త సభ్యత్వ నమోదు తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సభ్యత్వ రుసుములను నిబంధనల ప్రకారం రాష్ట్ర, జిల్లా వాటాలుగా సంబంధిత బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించారు. కార్యవర్గ సభ్యులంతా పరస్పర సమన్వయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు, సిబ్బంది జీతభత్యాలకు సంబంధించిన అంశాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, నిబంధనల మేరకు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సొసైటీకి సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులను అంతర్గతంగా చర్చించుకుని, సేవా కార్యక్రమాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా ముందుకెళ్లాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి డీఆర్వో లోకేశ్వరరావు, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ గంగరాజు, కార్యదర్శి గౌరీశంకర్, కోశాధికారి పల్టాసింగి సూర్యారావు, సొసైటీ ప్రతినిధులు నాగరాజు, జయలక్ష్మి, సుబ్రహ్మణ్యం, రవి, శ్రీనివాసరావు, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.


