చాపరాయి అందానికి బ్లాస్టింగ్‌ బీటలు | - | Sakshi
Sakshi News home page

చాపరాయి అందానికి బ్లాస్టింగ్‌ బీటలు

Aug 19 2026 12:18 AM | Updated on Aug 19 2026 12:18 AM

వంతెన నిర్మాణం కోసం పేలుళ్లు

రాళ్లను పగులగొడుతున్న వైనం

మారిన నిర్మాణం ప్రదేశం

కాంట్రాక్టర్‌ సౌలభ్యం కోసం

వేరే చోటకు మార్పు

వెల్లువెత్తుతున్న విమర్శలు

సినిమా తెరని మరపించే

అందానికి విఘాతం

ఎన్టీఆర్‌ నుంచి నేటి తరం హీరోల వరకు ఎన్నో క్లాసిక్‌ సినిమాలకు వేదిక

సహజసిద్ధమైన జలపాతం రూపురేఖలు మారుతాయని గిరిజనుల ఆవేదన

డుంబ్రిగుడ: సినిమా తెరపై అందాలను పంచిన ఆ చాపరాయి రాయి.. ఇప్పుడు బ్లాస్టింగ్‌ శబ్దాలతో దద్దరిల్లుతోంది! ఎన్నో దశాబ్దాలుగా సినీ చిత్రీకరణలకు వేదికగా నిలిచిన చాపరాయి జలపాతం వద్ద వంతెన నిర్మాణం కోసం రాళ్లను బ్లాస్టింగ్‌ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. గిరిజనుల రాకపోకల సౌకర్యం కోసం వంతెన అవసరమే అయినా.. అదే సమయంలో చాపరాయి సహజసౌందర్యానికి ఎలాంటి నష్టం కలగకూడదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

హీరోల అడుగులతో.. చరిత్ర

మండలంలోని చాపరాయి జలపాతం ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. నాటి ఎన్టీఆర్‌ నుంచి నేటి తరం సినీ హీరోల వరకు పలువురు అగ్ర నటుల చిత్రాలకు ఈ ప్రాంతం వేదికై ంది. చిరంజీవి నటించిన యముడికి మొగుడు చిత్రంలోని ఫైట్‌ సన్నివేశాలతో పాటు చాలెంజ్‌’, హీరో కృష్ణ నటించిన తెలుగు వీర లేవరా.. తదితర చిత్రాల చిత్రీకరణ ఇక్కడ జరిగింది. బాలకృష్ణ పట్టాభిషేకం, లారీ డ్రైవర్‌, వెంకటేష్‌ నటించిన చిత్రాలు, మోహన్‌బాబు మేజర్‌ చంద్రకాంత్‌, డిటెక్టివ్‌ నారద.. రాజేంద్రప్రసాద్‌ అలీబాబా అరడజను దొంగలు, ఆ ఒక్కటీ అడక్కు, గంగోత్రి తదితర సినిమాలు కూడా చాపరాయి అందాలను తెరపై ఆవిష్కరించాయి. కృష్ణంరాజు, శోభన్‌బాబు, చంద్రమోహన్‌, సుమన్‌, హరీష్‌ తదితర నటుల సినిమాలకూ ఈ ప్రాంతం వేదికగా నిలిచింది.

రాళ్ల మధ్య జాలువారే జలపాతం

చాపరాయి ప్రత్యేకత కేవలం సినిమా షూటింగులకే పరిమితం కాదు. సహజసిద్ధమైన రాళ్ల మధ్య నుంచి జాలువారే నీరు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జలపాతంలో జలకాలాడేందుకు వచ్చే సందర్శకులతో ఈ ప్రాంతం సందడిగా ఉంటుంది.

వంతెన కోసం.. బ్లాస్టింగ్‌

ఇలాంటి ప్రాంతంలో ప్రస్తుతం వంతెన నిర్మాణం కోసం రాళ్లను బ్లాస్టింగ్‌ చేస్తున్నారు. దీంతో సహజసిద్ధమైన చాపరాయి రూపురేఖలకు నష్టం వాటిల్లుతుందేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

● 2025 ఏప్రిల్‌ 7న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఈ ప్రాంతంలో పర్యటించిన సమయంలో పెద్దపాడు, కోసంగి తదితర గ్రామాల గిరిజనులు వంతెన నిర్మించాలని వినతిపత్రం అందజేశారు. గిరిజనుల ఇబ్బందులను గుర్తించిన ఆయన వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చారు.

అక్కడ కాదు.. ప్రమాదకర ప్రాంతంలో’..

చాపరాయి అందాలకు ఇబ్బంది కలగకుండా.. జలపాతం వద్ద కాకుండా పైభాగంలోని ప్రమాదకర ప్రాంతంలో వంతెన నిర్మించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా పర్యాటకులు చాపరాయి అందాలను వీక్షించేలా వేలాడే వంతెన ఏర్పాటు చేస్తే మరింత ఆకర్షణగా ఉంటుందని సూచించినట్లు పేర్కొంటున్నారు.

మారిన ప్రదేశం.. మొదలైన బ్లాస్టింగ్‌

అయితే ఏడాదిన్నర తర్వాత వంతెన నిర్మాణానికి నిధులు మంజూరవడంతో పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం బ్లాస్టింగ్‌ జరుగుతున్న ప్రాంతం సమతలంగా ఉండటంతో నిర్మాణ సంస్థకు పనిభారం తగ్గుతుందన్న కారణంతో అక్కడి రాళ్లను తొలగిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వంతెన వస్తే.. పర్యాటకానికి వరమా? శాపమా?

వంతెన నిర్మాణం పూర్తయితే గిరిజన గ్రామాల రాకపోకలకు ఎంతో ఉపయోగకరమే. అయితే వంతెనపై నుంచి పర్యాటకులు చాపరాయి ప్రాంతాన్ని వీక్షించే అవకాశం ఉండటంతో సందర్శకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో నియంత్రణ లేకపోతే మద్యం సేవించడం, ప్లాస్టిక్‌ సీసాలు, ఇతర వ్యర్థాలు పడేయడం వంటి సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని స్థానికులు, పర్యాటక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి అవసరమే.. కానీ చాపరాయి సహజసౌందర్యం మూల్యం చెల్లించేలా మాత్రం ఉండకూడదు. గిరిజనులకు రాకపోకల సౌకర్యం కల్పిస్తూనే.. జలపాతం సహజత్వాన్ని కాపాడేలా వంతెన నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది.

వంతెన కాస్త ముందు నిర్మిస్తే మేలు

మా గ్రామాలకు వంతెన రావడం ఎంతో సంతోషం. అయితే వంతెన నిర్మాణాన్ని చాపరాయిలో కాకుండా, కొద్దిగా ముందున్న ప్రమాదకరమైన ప్రదేశంలో చేపట్టాలి. ఆ ప్రాంతంలో వంతెన నిర్మిస్తే ప్రమాదాలు తగ్గడంతో పాటు చాపరాయికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ విషయాన్ని అధికారులు దృష్టిలో పెట్టుకుని వంతెన నిర్మాణం చేపట్టాలి.

– మఠం శంకర్‌రావు, వైఎస్సార్‌సీపీ మండల కార్యదర్శి, కోసంగి, డుంబ్రిగుడ మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement