సీపీఎం నాయకుల వినతి
తుమ్మపాల: ఒకే కుటుంబానికి చెందిన ఓట్లు వేర్వేరు పోలింగ్ బూత్‌ల్లో ఉండడం వల్ల ఓటర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సర్ ప్రక్రియలో భాగంగా ఒకే పోలింగ్ బూత్‌లో నమోదు చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు వి.వి.శ్రీనివాసరావు, అల్లు రాజు కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లో డీఆర్‌వో వై. సత్యనారాయణరావును కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు, పిల్లలు ఒకే చిరునామాలో నివసిస్తున్నప్పటికీ వేర్వేరు బూత్‌లకు ఓట్లు కేటాయించడం సరికాదన్నారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కుటుంబ సభ్యులందరూ కలిసి వెళ్లి ఒకే పోలింగ్ బూత్‌లో ఓటు వేసుకునేలా అవకాశం కల్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగానే తుది జాబితా ప్రచురించేలోపే ఓటర్ల జాబితాలను పరిశీలించి, ఒకే ఇంటి చిరునామాలో నివసిస్తున్న కుటుంబ సభ్యుల ఓట్లను ఎన్నికల నిబంధనలు, పోలింగ్ కేంద్రాల పరిధికి లోబడి ఒకే పోలింగ్ బూత్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. బూత్ స్థాయి అధికారులు, ఎన్నికల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన సవరణలు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.


