అనకాపల్లి : నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్‌కు ఈ నెల 23న భూమి పూజ చేయడానికి ఏర్పాట్లు చేయడం సరికాదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం అన్నారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో బుధవారం రౌండ్‌టేబుల్‌సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైజాగ్ –చైన్నె ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టోలో భాగంగా నక్కపల్లి మండలంలో రాజయ్యపేట, బుచ్చిరాజుపేట, చందనాడ, అమలాపురం, డిఎల్.పురం ఐదు పంచాయతీల పరిధిలో 11 గ్రామాల నుండి 5,500 ఎకరాల భూమి రైతుల నుంచి బలవంతంగా ప్రభుత్వం సేకరించిందన్నారు. 2,100 ఎకరాల భూమిని ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం కేటాయించిందని, నిర్వాసితులైన రైతులు, కూలీలు, వృత్తిదారులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఇవ్వాల్సిన పరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు ఇప్పటివరకు పూర్తిగా అమలు చేయలేదన్నారు. నిర్వాసిత కాలనీలో ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ఆగమేఘాలమీద ప్రస్తుతం నివసిస్తున్న ఇళ్లు నేలమట్టం చేసి నిర్వాసితులను నడిరోడ్డుపై నెట్టివేయడం అన్యాయమన్నారు. రైతులు, నిర్వాసితులకు పూర్తిస్థాయి ప్యాకేజీ, పునరావాసం కల్పించాలని, ఆర్.కార్డులు ఇవ్వాలని, పర్మినెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని, కంపెనీ నిర్మాణ దశలో నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని కోరారు. జిరాయితీ భూములతో సమానంగా డి–ఫారం సాగు భూములకు కూడా పూర్తిస్థాయి పరిహారం చెల్లించాలన్నారు. వివాహమైన ఆడపిల్లలకు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ, యువకులకు భూసేకరణ సందర్భంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, ఇంటి స్థలం ఇవ్వాలన్నారు. ఇళ్లు కోల్పోయి నిర్వాసితులైన కుటుంబాలకు ప్రస్తుతం ఇచ్చిన ప్యాకేజీ రూ.8,98,000 అంగీకారం కాదని, పెరిగిన ఇంటి నిర్మాణ సామాగ్రి ధరలకు అనుగుణంగా రూ.25 లక్షల ప్యాకేజీ పెంచి ఇవ్వాలన్నారు. నిర్వాసితుల కాలనీలో విద్యా, వైద్యం, విద్యుత్, నీటి సౌకర్యంతో పాటు 25 రకాల మౌలిక సదుపాయాలు పూర్తిగా కల్పించే వరకు బలవంతంగా ఖాళీ చేయించకూడదని ఆయన కోరారు. కార్యక్రమంలో సీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.అప్పలరాజు, డి.వెంకన్న, ఆర్.శంకరరావు, గంటా శ్రీరామ్, గనిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.


