నాతవరం : జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని డీఈవో గిడ్డి అప్పారావునాయుడు అన్నారు. మండలంలో బుధవారం నాతవరం డి.యర్రవరం హైస్కూల్లో గల పరీక్ష కేంద్రాలను ఆయన స్వయంగా పరిశీలించారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. తర్వాత మర్రిపాలెం పంచాయతీ శివారు వె న్నలపాలెంలో గల పాఠశాలను ఆకస్మాకంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతం కంటే ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించామన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం దగ్గర్నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహించడం వంటి జాగ్రత్తలు చేపట్టామన్నారు, విద్యార్థులకు విద్యతో పాటు అరోగ్య విషయంలో కూడా శ్రద్ధ అవసరమని అన్నారు. కార్యక్రమంలో ఎంఈవోలు కామిరెడ్డి వరహాలబాబు, బ్రహ్మజీ, సిబ్బంది పాల్గొన్నారు.
పది హిందీ పరీక్షకు 66 మంది గైర్హాజరు
అనకాపల్లి టౌన్: పదవ తరగతి హిందీ సబ్జెక్ట్ పరీక్షల్లో జిల్లా వ్యాప్తంగా జరిగిన 102 కేంద్రాలలో 20,581 మంది విద్యార్థులకు గానూ 20,519 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 62 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఓపెన్ స్కూల్ హిందీ పరీక్షకు 439 మంది విద్యార్థులకు గానూ 373 మంది విద్యార్ధులు పరీక్షలు రాయగా 66 మంది పరీక్షలకు హాజరు కాలేదన్నారు. ఈ పరీక్ష కేంద్రాలను ఏడు స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించారన్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని డీఈవో తెలిపారు.


