స్తవ్యస్త వైద్యం | - | Sakshi
Sakshi News home page

స్తవ్యస్త వైద్యం

Mar 18 2026 8:14 AM | Updated on Mar 18 2026 8:14 AM

సంపూర్తి భవనం
చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో వసతుల లేమి

ఒకే గదిలో నలుగురు వైద్యులు.. 30 పడకల స్థానంలో 50 మంది రోగుల అవస్థలు.. నెలకు సుమారు వంద వరకు ప్రసవాలు. మన్యంలో వేలాది మంది గిరిజనులకు ప్రాణాధారమైన చింతపల్లి ఏరియా ఆసుపత్రి ప్రస్తుతం వసతుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా, నిధులు మంజూరై నిర్మాణం చివరి దశకు చేరుకున్నా, నేటికీ కొత్త భవనం గిరిజనులకు అందుబాటులోకి రాలేదు.

చింతపల్లి: ఈ ప్రాంతంలోని గిరిజనులకు వైద్య సేవలందించడంలో కీలకపాత్ర పోషిస్తున్న స్థానిక ఏరియా ఆసుపత్రి ప్రస్తుతం తీవ్రమైన వసతి సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఎనిమిదేళ్ల క్రితమే ఈ ఆసుపత్రిని వంద పడకల స్థాయికి అప్‌గ్రేడ్‌ చేసినప్పటికీ, నూతన భవన నిర్మాణం పూర్తికాకపోవడంతో రోగులు, వైద్యులు నానా అవస్థలు పడుతున్నారు.

నిధులున్నా .. నిరీక్షణ

గత ప్రభుత్వ హయాంలో ఈ వంద పడకల ఆసుపత్రి కోసం మండల కేంద్రం సమీపంలోని పట్టు పరిశ్రమకు చెందిన 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. నూతన భవన నిర్మాణానికి రూ. 25 కోట్ల నిధులను కూడా మంజూరు చేయగా, 2021 చివరలో ఏపీఎంఎస్‌ఐడీసీ పర్యవేక్షణలో పనులు ప్రారంభమయ్యాయి. వాస్తవానికి ఈ పనులు 2023 నాటికే పూర్తి కావాల్సి ఉంది. కానీ, నిధుల విడుదలలో జాప్యం కారణంగా పనులు నెమ్మదించాయి. గత రెండు నెలల వరకు వేగంగా జరిగిన పనులు, ప్రస్తుతం కాంట్రాక్టర్‌ నిలిపివేయడంతో స్థానిక గిరిజనులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

అత్యాధునిక సౌకర్యాలతో 200 పడకల ప్రణాళిక

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఈ నూతన భవనాన్ని భవిష్యత్తులో 200 పడకల సామర్థ్యంతో ఉపయోగించుకునేలా, నాలుగు అంతస్తులలో నిర్మిస్తున్నారు:

మొదటి అంతస్తు: ఎమర్జెన్సీ వార్డు, ఓపీ, సమావేశ మందిరం, పరిపాలనా విభాగం, సూపరింటెండెంట్‌ కార్యాలయం.

రెండో బ్లాక్‌: ఇన్‌పేషెంట్‌ వార్డులు.

మూడో బ్లాక్‌: అత్యాధునిక ఆపరేషన్‌ థియేటర్లు.

నాలుగో బ్లాక్‌: ఐసీయూ, ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌, ఎక్స్‌రే, ల్యాబ్‌లు.అంతేకాకుండా బ్లాక్‌ నుంచి బ్లాక్‌కు వెళ్లేందుకు ఎలివేటెడ్‌ కారిడార్లు, అదనంగా మార్చురీ, బయో–మెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఫైర్‌ సేఫ్టీ వంటి వసతులతో ఈ నిర్మాణం చేపట్టారు.

పాత భవనంలో అరకొర వసతులు

కొత్త భవనం అందుబాటులోకి రాకపోవడంతో, రెండున్నర దశాబ్దాల క్రితం నిర్మించిన పాత భవనంలోనే వైద్య సేవలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రిలో కేవలం 30 పడకలు మాత్రమే ఉన్నప్పటికీ, రోగుల రద్దీ దృష్ట్యా వైద్యులు మరో 20 బెడ్లను సర్దుబాటు చేసి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ 23 మంది వైద్యులు, 63 మంది సిబ్బంది ఉండాలి. కానీ గదుల కొరత వల్ల ఒక్కో గదిలోనే నలుగురు వైద్యులు కూ ర్చుని రోగులను పరీక్షించాల్సి వస్తోంది. ఇది అటు వై ద్యులకు, ఇటు రోగులకు ఇబ్బందికరంగా మారింది.

రెండు మండలాలకు ఏకై క దిక్కు

చింతపల్లి మండలంలోని కోరుకొండ, లోతుగెడ్డ, లంబసింగి, తాజంగి, గూడెం కొత్తవీధి మండలంలోని జెర్రెలు, పెదవలస, ఆర్‌వీ నగర్‌, జీకే వీధి, సీలేరు పీహెచ్‌సీల పరిధిలో గ్రామాలతోపాటు కొయ్యూరు,, జి.మాడుగుల మండలాల సరిహద్దు గ్రామాల ప్రజలకు ఈ ఆసుపత్రే పెద్ద దిక్కు. ప్రతిరోజూ 250 నుంచి 300 మందికి పైగా రోగులు ఇక్కడకు వస్తుంటారు. నెలకు సగటున 80 నుంచి 100 ప్రసవాలు జరుగుతాయి. నవజాత శిశు సంరక్షణ కేంద్రం, రక్త నిల్వ కేంద్రం, టీబీ విభాగం వంటి కీలక విభాగాలు కూడా ఈ పాత భవనంలోనే ఇరుకుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి, నిలిచిపోయిన భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, తద్వారా గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

వేధిస్తున్న వసతి సమస్య

అసంపూర్తిగా నూతన భవనం

స్థాయి పెంచినా మెరుగుపడని వసతులు

ఒకే గదిలో నలుగురు వైద్యులు

30 పడకల స్థానంలో 50 మంది రోగులు

పట్టించుకోని సర్కారు

అధికారులు దృష్టికి సమస్య

ఆసుపత్రి భవన నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అదికారులు దృిష్టికి తీసుకు వెళ్లాం.ఉన్న పాత భవనంలోనే రోగులకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా వైద్య సేవలందిస్తున్నాం. ఒక్క గదిలోనే నలుగురు వైద్యలు సేవలండించాల్సి వస్తోంది.

– నీలవేణి, ఆసుపత్రి సూపరింటెండెంట్‌, చింతపల్లి

త్వరగా పూర్తిచేయాలి

చింతపల్లిలో నిలిచిపోయిన ఆస్పత్రి భవన నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేయాలి.వంద పడకల ఆసుపత్రికి తగినట్లుగా వసతి సౌకర్యం లేకపోవడంతో వైద్యుల,రోగుల ఇబ్బందుల పడుతున్నారు.త్వరగా అందుబాటులోకి వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.

– కోరాబు అనూషదేవి, ఎంపీపీ, చింతపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement