డుంబ్రిగుడ: స్థానిక వీడీవీకే మిల్లేట్ హబ్‌ను అసిస్టెంట్ ట్రైనింగ్ కలెక్టర్ మనీషా, పాడేరు ఐటీడీఏ అసిస్టెంట్ ఏపీవో వెంకటేశ్వరరావు మంగళవారం సందర్శించారు. ఈ కేంద్రంలో రూ. 20 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన చిరుధాన్యాల ప్రాసెసింగ్ యంత్రాలను వారు నిశితంగా పరిశీలించారు. అనంతరం వీడీవీకే కేంద్రాన్ని నిర్వహిస్తున్న మహిళా సంఘాల సభ్యులతో వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. నాణ్యమైన చిరుధాన్యాలను సేకరించి, వాటిని ప్రాసెస్ చేసి ప్రజలకు సరసమైన ధరలకే అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో చిరుధాన్యాల సాగును, వినియోగాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


