● లోయలో పడిన యువకుడికి
తీవ్ర గాయాలు
● కాపాడిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు,
మాజీ మంత్రి బాలరాజు
చింతపల్లి: లంబసింగి ఘాట్ రోడ్డులో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. చింతపల్లి మండలం కొత్తపాలెం పంచాయతీ భీమసింగి గ్రామానికి చెందిన సెగ్గే గురుబాబు, తన అన్న కుమారుడిని కొత్త అమావాస్య పండుగకు తీసుకురావడానికి బైక్‌పై నర్సీపట్నం బయలుదేరాడు. మార్గమధ్యంలో లంబసింగి ఘాట్‌లోని బోడకొండమ్మ ఆలయం దాటిన తర్వాత, ఒక ప్రమాదకరమైన మలుపు వద్ద బైక్ అదుపుతప్పి రక్షణ గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గురుబాబు సుమారు 20 అడుగుల లోతు ఉన్న లోయలో పడిపోయాడు. అదే సమయంలో చింతపల్లి పర్యటన ముగించుకుని నర్సీపట్నం వెళ్తున్న పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అలాగే చింతపల్లి వస్తున్న మాజీ మంత్రి పసుపులేటి బాలరాజులు వెంటనే తమ వాహనాలను నిలిపారు. స్థానికుల సహాయంతో లోయలో ఉన్న గురుబాబును బయటకు తీయించి, వెంటనే అంబులెన్స్‌ను రప్పించారు. క్షతగాత్రుడిని హుటాహుటిన నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ ప్రమాదంలో గురుబాబు తీవ్రంగా గాయపడ్డాడు.


