● ఏర్పాట్లు పూర్తి
సీలేరు: గిరిజనుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ ధారకొండ దా రాలమ్మ అమ్మ వారి ప్రధాన జాతర మహోత్సవం బుధవారం కొత్త అమావాస్య పర్వదినం సందర్భంగా అత్యంత అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ నెల 7వ తేదీన అంకురార్పణతో ప్రారంభమైన ఈ జాతర మహోత్సవాలు 15 రోజుల పాటు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. జాతరలో భాగంగా వివిధ గ్రామాల్లో పర్యటించిన అమ్మవారి పవిత్ర గరగలు మంగళవారం సాయంత్రం 6 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకున్నాయి. రాత్రంతా భక్తుల జాగరణ అనంతరం, బుధవారం తెల్లవారుజామున అమ్మవారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
విశేష పూజలు: తెల్లవారుజాము నుంచి సాయంత్రం 3.54 గంటల వరకు భక్తులకు నిత్య పూజలు, దర్శన సౌకర్యం కల్పించనున్నారు.
నైవేద్య సమర్పణ: వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులు అమ్మవారికి ధూప, దీప, నైవేద్యాలను సమర్పించుకోనున్నారు. అనంతరం అమ్మవారికి మహా నైవేద్యం నివేదించి, సాయంత్రం ఆలయ ద్వారాలను మూసివేస్తారు.
ద్వార దర్శనం: గురువారం ఉదయం 7.24 గంటలకు ఆలయ తలుపులు తెరిచి, యథావిధిగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి సాంబశివరావు తెలిపారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ ఆవరణలో భారీగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ప్రత్యేక ఉత్సవాలు: ప్రధాన పండుగ సందర్భంగా దారకొండ గ్రామస్తులు మేళతాళాలతో, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకోనున్నారు.


