అరకులోయ: అరకులోయలోని గిరిజన సంక్షేమ గురుకుల క్రీడా పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి ఆర్చరీ (విలువిద్య) పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ పి.ఎస్.ఎన్. మూర్తి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను వివరించారు. ఈ నెల 7వ తేదీన విశాఖపట్నం జిల్లా పరవాడలోని సంస్కృతి గ్లోబల్ పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి ఆర్చరీ పోటీల్లో అండర్–15 విభాగంలో వంతాల లలిత్ సాయి తేజ, పాంగి రమేష్, కె. సంపత్ కుమార్.. అలాగే అండర్–13 విభాగంలో కేత్విన్ హర్ష, కె. రవికాంత్ రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. అనంతరం ఈ నెల 11న నూజివీడులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో లలిత్ సాయి తేజ అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని సాధించి జాతీయ స్థాయికి అర్హత సాధించాడు. అండర్–13 విభాగంలో కేత్విన్ హర్ష, ఎ. రవికాంత్ కూడా ప్రతిభ కనబరచి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. వీరంతా ఈ నెల 26న గుంటూరులోని వీవీఐటీ కళాశాల క్రీడా మైదానంలో జరగనున్న జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో పాల్గొంటారని ప్రిన్సిపాల్ తెలిపారు. జాతీయ స్థాయికి ఎంపికై న విద్యార్థులను ప్రిన్సిపాల్ మూర్తితో పాటు ఆర్చరీ కోచ్ ఎల్. సూరిబాబు, ఇతర శిక్షకులు, ఉపాధ్యాయులు అభినందించారు.


