● పీడీ విద్యాసాగర్
గూడెంకొత్తవీధి: ఉపాధి హామీ పథకం పనుల నిర్వహణలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పథకం ప్రాజెక్ట్ డైరెక్టర్ డీవీ విద్యాసాగర్ హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంలో ఉపాధి హామీ పనులకు సంబంధించి సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఎంపీపీ బోయిన కుమారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీడీవో రమణబాబు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీడీ విద్యాసాగర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు వెచ్చించి ఉపాధి పనులను కల్పిస్తోందని, పనులను పారదర్శకంగా చేపట్టేందుకు అనేక వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మండలంలో 2024 నుంచి 2025 వరకు రూ. 32 కోట్ల వ్యయంతో సుమారు 3 వేలకు పైగా పనులు చేపట్టామన్నారు. అయితే, కొన్ని పంచాయతీల్లో చేసిన పనులకు సంబంధించి సరైన రికార్డులు, ఫొటోలు లేవని ఆయన అసహనం వ్యక్తం చేశారు. పనులకు సరైన ఆధారాలు లేకపోతే నిధులు దుర్వినియోగం అయినట్లుగానే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. చాలా చోట్ల మస్టర్లలో పనిచేసిన వారి సంతకాలు లేకున్నా నిధుల చెల్లింపులు జరగడం, కొన్ని చోట్ల చనిపోయిన వ్యక్తుల పేరిట పెన్షన్ల పంపిణీ జరగడం వంటి అక్రమాలను గుర్తించామన్నారు. అక్రమాలు జరిగిన చోట బాధ్యుల నుంచి నిధులను రికవరీ చేయాలని అధికారులను ఆదేశించారు. డీఈ రఘు, ఎస్‌ఆర్‌పీ అచ్యుత్, ఏపీవో రాంప్రసాద్, వైస్‌ఎంపీపీ ఆనంద్, సర్పంచ్‌లు పాల్గొన్నారు.


