సీలేరు: హైదరాబాద్‌కు చెందిన శ్రీ సాయి సేవా సమితి ఆధ్వర్యంలో అప్పర్ సీలేరులోని గురుకుల బాలుర పాఠశాలకు మంగళవారం క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. సుమారు రూ. 50 వేల విలువైన వివిధ రకాల క్రీడా వస్తువులతో పాటు, పాఠశాల అవసరాల నిమిత్తం ఒక అహుజా పోర్టబుల్ పీఏ యాంప్లిఫైయర్‌ను సమితి ప్రతినిధులు అందజేశారు. సమితి వైస్ ప్రెసిడెంట్ వల్లీ ప్రసాద్, సభ్యులు వెంకట్, సత్యనారాయణ చేతుల మీదుగా ఈ సామగ్రిని పాఠశాల క్రీడా విభాగానికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మారుమూల ప్రాంతాల్లోని ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు క్రీడల్లో కూడా రాణించాలనే ఉద్దేశంతోనే ఈ స్వచ్ఛంద సాయం అందించామని వారు తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ బుచ్చి బాబు, పీఈటీ గంగరాజు, డిప్యూటీ వార్డెన్ సునీల్ కుమార్, ఎన్. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సామగ్రిని పంపిణీ చేశారు.


