సిండికేట్లు | - | Sakshi
Sakshi News home page

సిండికేట్లు

Mar 17 2026 7:54 AM | Updated on Mar 17 2026 7:54 AM

తక్కువ ధరతో కొనుగోలు ● తీవ్రంగా నష్టపోతున్న కూరగాయల రైతులు

సాక్షి, పాడేరు: సంతల్లో వ్యాపారుల సిండికేట్‌ దెబ్బకు కూరగాయల రైతులు విలవిలలాడుతున్నారు. ధరలను బాగా తగ్గించి కొనుగోలు చేస్తుండడంతో నష్టాల్లో కూరుకుపోతున్నారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేసే కూరగాయలు నాణ్యత, రుచిలో నంబర్‌–1గా గుర్తింపు ఉన్నా పండించిన రైతుకు మాత్రం నష్టాలే మిగులుతున్నాయి.రిటైల్‌ మార్కెట్‌లో అధిక ధరలకు కూరగాయలు విక్రయిస్తున్నా, గిరిజన రైతుల వద్ద మాత్రం వ్యాపారులు కారుచౌకగానే కొనుగోలు చేస్తున్నారు. విశాఖ,గాజువాక, విజయనగరం, ఎస్‌.కోట, అనకాపల్లి, తుని ప్రాంతాల నుంచి జిల్లాలో జరిగే సంతలకు సుమారు 60 మంది వ్యాపారులు వస్తారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి కూరగాయల ధరలను పతనం చేస్తున్నారు.ఇంటిల్లపాది కష్టపడి సాగు చేసిన కూరగాయలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు ఉసూరుమంటున్నారు.

అన్నింటికీ తక్కువ ధరలే

రబీలో సాగు చేసిన కూరగాయల దిగుబడులు వస్తుండడంతో గిరిజన రైతులు సంతల్లో అమ్మకాలు ప్రారంభించారు. అన్ని పంటలకు తక్కువ ధరలే లభిస్తుండడంతో వారికి నష్టాలు తప్పడం లేదు. 50 కిలోల క్యారెట్‌ రూ.1000, బంగాళాదుంపలు రూ.800 నుంచి రూ.1000, 40 కిలోల క్యాబేజీ రూ.700 నుంచి రూ.800 ధరలతో వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు..టమాటా కిలో రూ.10 దాటి కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాలీఫ్లవర్‌, పచ్చిమిర్చి ధరలు కూడా తక్కువుగానే ఉన్నాయి. దుకాణాల్లో ఏ కూరగాయలు కొనాలన్నా కిలో రూ.50కిపైగా పలుకుతున్నాయి. గిరిజన రైతులు మాత్రం కిలో రూ.20లోపే విక్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement