గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమళ
కొయ్యూరు: రానున్న విద్యా సంవత్సరంలో ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల సర్దుబాటుకు చర్యలు తీసుకుంటామని గిరిజన సంక్షేమ డీడీ పి.బి.కె. పరిమళ తెలిపారు. మంప, రాజేంద్రపాలెం,రావణాపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలను ఆమె సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొన్ని పాఠశాలల్లో అధిక సంఖ్యలో, మరికొన్ని పాఠశాలల్లో తక్కువ సంఖ్యలో విద్యార్థులున్నారని చెప్పారు. ఎక్కువ మంది ఉన్న పాఠశాలల్లో వసతుల సమస్యలు వస్తున్నాయని తెలిపారు. అందువల్ల విద్యార్థుల సర్దుబాటుకు సంబంధించి ప్రతిపాదనలు పంపిస్తున్నట్టు చెప్పారు. ఒక్కో పాఠశాలలో 320 కి మించి విద్యార్థులులేకుండా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. రూ.30 కోట్ల వ్యయంతో ఆశ్రమ పాఠశాలల్లో మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించనున్నట్టు ఆమె చెప్పారు. పీఎం జన్మన్‌లో కొత్త భవనాలు మంజూరయ్యాయని తెలిపారు. రాజేంద్రపాలెం బాలికల ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినులతో ఆమె మాట్లాడారు.తెలుగు పరీక్ష ఎలా రాశారో అడిగి తెలుసుకున్నారు. తెలుగు ఉపాధ్యాయుడి ని వివరాలు అడిగారు. ఏటీడబ్ల్యువో క్రాంతి కుమార్ పాల్గొన్నారు.


