కిక్కిరిసిన కలెక్టరేట్‌ | - | Sakshi
Sakshi News home page

కిక్కిరిసిన కలెక్టరేట్‌

Mar 17 2026 7:54 AM | Updated on Mar 17 2026 7:54 AM

పలు సమస్యలపై తరలివచ్చిన ప్రజలు

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు, నిరసనలు

పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌లో మొత్తం – 314 అర్జీలు

తుమ్మపాల: పలు సమస్యలు పరిష్కారం కోరుతూ జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన ప్రజలతో కలెక్టరేట్‌ కిక్కిరిసింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టర్‌ కార్యాలయం కిటకిటలాడింది. మరోవైపు గేటు బయట ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు, నిరసనలు కొనసాగాయి. ఇదే సమయంలో పలువురు తమ కష్టాలను కలెక్టరమ్మకు మొరపెట్టుకున్నారు. పదే పదే అధికారుల చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు, రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమాల్లో కలెక్టర్‌ విజయ కృష్ణన్‌, జేసీ శౌర్యమాన్‌ పటేల్‌, డీఆర్వో వై. సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌లో నమోదైన 24 గంటల్లో విచారణ చేపట్టి అర్జీని పరిష్కారం చేయాలన్నారు. అర్జీలు పునరావృతం అయితే అధికారులదే బాధ్యత అన్నారు. జిల్లా స్థాయి అధికారులు తప్పకుండా అర్జీదారులతో మాట్లాడి, సమస్య పూర్వాపరాలు తెలుసుకొని సరైన పరిష్కారం చూపాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో 14, రెవెన్యూ క్లినిక్‌లో 169 వినతులు నమోదయ్యాయి. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

భూ ఆక్రమణపై పదేపదే ఫిర్యాదు చేస్తున్నా...

ప్రభుత్వ భూముల ఆక్రమణపై పదేపదే ఫిర్యాదులు చేస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకుండా ఆక్రమణదారులకు అండగా నిలుస్తున్నారని కలెక్టరే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని అనకాపల్లి మండలం ఊడేరు గ్రామానికి చెందిన డి.గంగరాజు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశాడు. గ్రామంలో సర్వే నంబర్లు 211, 28లో ప్రభుత్వ భూములను ఆక్రమిస్తూ ప్రైవేటు వ్యక్తులు లేఅవుట్‌ నిర్మించి ప్లాట్ల విక్రయాలు చేపడుతున్నారు. కొండను చదును చేసి లేఅవుట్‌లో కలిపేయడం, కొండ గెడ్డ రూపురేఖలు మార్చేయడంపై అనేక ఫిర్యాదులు చేసినా ప్రయోజనం లేదు. వెంటనే భూ ఆక్రమణలు తొలగించి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరాడు.

కోళ్ల ఫారాన్ని నిలిపివేయాలని ఫిర్యాదు

గ్రామస్తుల అంగీకారం లేకుండా పంచాయతీ పాలకవర్గం తీర్మానంతో గ్రామానికి సమీపంలో నిర్మించనున్న కోళ్ల ఫారాన్ని తక్షణమే నిలిపివేసి ప్రజారోగ్యాన్ని కాపాడాలంటూ చీడికాడ మండలం చెట్టుపల్లి గ్రామస్తులు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో తామంతా పశువుల పోషణ, వ్యవసాయం ద్వారానే జీవిస్తున్నామని, పాలకులు జేబులు నింపుకుని పచ్చని గ్రామంలో కోళ్ల ఫారాలు ఏర్పాటు చేసి గ్రామాన్ని కలుషితం చేస్తున్నారని వాపోయారు. మా గ్రామంలో ఎటువంటి కోళ్ల ఫారాలు లేకుండా పనులు నిలిపివేయాలని కోరారు.

రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో బస్టాప్‌ తొలగింపు

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల కోసం అనకాపల్లి ప్రధాన రహదారికి ఆనుకున్న బాలకృష్ణ బస్టాప్‌ను రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో జీవీఎంసీ అధికారులు తొలగించడం దారుణమని, తక్షణమే పునర్నిర్మించాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత కె.హరినాథ్‌బాబు కలెక్టర్‌కు వినతి అందించారు. కొందరు నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం బస్టాప్‌ను తొలగించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

వసతి గృహానికి సొంత భవనం కేటాయించాలి

చీడికాడ ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహానికి సొంత భవనం కేటాయించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.బాలాజీ, పి.విజయ్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.

120 మంది విద్యార్థినులు ఉన్నప్పటికి సరైన సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అద్దె భవనంలోనూ మరుగుదొడ్లు లేవన్నారు. క్లాస్‌ రూములు, బ్లాక్‌ బోర్డ్‌ లేవన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఎస్‌ఎఫ్‌ఐ మండల నాయకుడు జి. అప్పలరాజు, సభ్యులు ఉన్నారు.

దివ్యాంగుల నిరసన

అనకాపల్లిలో దివ్యాంగుల జిల్లా కార్యాలయాన్ని నిర్మించి పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించాలని దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద దివ్యాంగులు నిరసన చేపట్టారు. దివ్యాంగుల సమస్యల కోసం విజయనగరం జిల్లా కార్యాలయానికి వెళ్లాల్సి వస్తుందన్నారు. అక్కడ అరకొర సిబ్బందితో సమస్యలు పరిష్కారం కావడం లేదని వాపోయారు. అలింకో సంస్థ ద్వారా ప్రత్యేక ఉపకరణాలు అందించాలని, సబ్సిడీ రుణాలు, అంత్యోదయ రేషన్‌ కార్డులు మంజూరు చేయాలని, నిలిపివేసిన దివ్యాంగుల పింఛన్లు పునరుద్ధరణ చేయాలంటూ కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement