మాకవరపాలెం : తాటిచెట్టుపై నుంచిపడి కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు. మండలంలోని జి.వెంకటాపురం గ్రామానికి చెందిన పోలవరపు రాంబాబు(45) గీత వృత్తిని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే సోమవారం ఉదయం తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తూ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రాంబాబు మరణించినట్టు వైద్యులు తెలిపారు. రాంబాబుకు ఒక కొడుకు, కుమార్తె ఉండగా కుమార్తెకు వివాహం చేశాడు. రాంబాబు మృతితో కుటుంబీకులు పెద్ద దిక్కును కోల్పోయామని బోరున విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


