అనకాపల్లి: ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మండలం వెంకుపాలెం గ్రామం రైతు సేవా కేంద్రం వద్ద సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం కలెక్టర్ విజయక్రిష్ణన్‌తో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు చేసిన మేలును వివరించడం లక్ష్యంగా గన్నవరంలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో సుమారు 46.83 లక్షల మందికి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయగా, తొలి విడతలో రూ.7000 చొప్పున రూ.3174 కోట్లు, రెండో విడతలో రూ.3,135 కోట్లు, మూడో విడతలో రూ.6000 చొప్పున రూ.2600 కోట్లు చొప్పున సుమారు రూ.9వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ ప్రభుత్వం జమ చేసిందన్నారు. జిల్లాలో రూ.132 కోట్లు జమ చేయడం జరిగింద న్నారు. నేటి పరిస్థితుల్లో ప్రతి రోజు క్యాన్సర్ బాధితులతో ఒక రైలు ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అందుకే ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేసే విధంగా చర్యలు చేపడుతున్నామని, లెఫ్ట్ కెనాల్ ద్వారా జిల్లాకు పుష్కలంగా సాగునీరు అందించే అవకాశం ఉందని అన్నారు. కలెక్టర్ విజయక్రిష్ణన్ మాట్లాడుతూ వ్యవసాయం, అనుబంధ రంగాల శాఖల సిబ్బంది రైతుల ఇళ్లకు వెళ్లి ఆధునిక వ్యవసాయ పద్ధతులతో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధనకు ‘రైతులకు అవగాహన కలిగించడం రైతన్న మీకోసం’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. జిల్లాలో మరింత విస్తీర్ణంలో ప్రకృతి విధానంలో సాగు చేపట్టేలా రైతులలో అవగాహన పెంచాలని వ్యవసాయాధికారులను ఆమె కోరారు. జిల్లాలో 60 డ్రోన్లను రైతులకు అందించడం జరిగిందన్నారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్‌కు ప్రభుత్వ మద్దతు గురించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆశా దేవి, వివిధ రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు బత్తుల తాతయ్య బాబు, పీలా గోవింద సత్యనారాయణ, మళ్ల సురేంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీష్, రైతులు పాల్గొన్నారు.


