దేవరాపల్లి : మారేపల్లికి చెందిన కిల్లి కృష్ణ (23) అనే యువకుడు చైన్నెలో అకాల మరణం చెందడంతో అతడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు శోక సంద్రంలో మునిగిపోయారు. బతుకు తెరువు కోసం ఏడాది క్రితం చైన్నెలో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరిన కృష్ణ తన నివాసానికి సమీపంలో ప్రమాదవశాత్తూ చెరువులో పడి ఈ నెల 14న మృతి చెందాడని అతని కుటుంబ సభ్యులు విలేకర్లకు తెలిపారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సోమవారం సాయంత్రం దేవరాపల్లి మీదుగా స్వగ్రామం మారేపల్లికి తీసుకువచ్చారు. ఉద్యోగం చేసి తమను ఆదుకుంటాడనుకున్న కొడుకు మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు అప్పలనాయుడు, ఎర్రయ్యమ్మ తల్లడిల్లిపోయారు. వారు గుండెలవిసేలా రోందించిన తీరు అక్కడ ఉన్నవారందర్నీ కలిచివేసింది. తమ స్నేహితుడు శాశ్వతంగా దూరమయ్యాడని తెలుసుకున్న యువకులు, గ్రామస్తులు చైన్నె నుంచి మృతదేహాన్ని తీసుకువచ్చిన వాహనానికి ఎదురుగా వెళ్లి ఊరేగింపుగా శ్మశాన వాటికకు తీసుకువచ్చారు. అంతిమయాత్ర అనంతరం కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.


