సీపీఐఎంఎల్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్న గిరిజనులు
నర్సీపట్నం: కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించి గిరిజనులకు న్యాయం చేయాలని సీపీఐఎంఎల్ నాయకులు బంగార్రాజు, జనార్దన్ డిమాండ్ చేశారు. సీపీఐఎంఎల్ ఆధ్వర్యంలో గిరిజనులు సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఫోర్జరీ సంతకాలతో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. రోలుగుంట మండలం కొండఅడ్డసారం గ్రామంలో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూమిని ప్రకాష్ అనే భూస్వామి కాజేసేందుకు ఫోర్జరీ సంతకాలతో తప్పుడు పత్రాలు సృష్టించారన్నారు. తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించిన వ్యక్తిపై క్రిమినల్ కేసు పెట్టాలని, సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏవోకు వినతిపత్రం అందజేశారు.


