● గిరిజనులకు ఒరిగింది శూన్యం
● మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి విమర్శ
పాడేరు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాడేరు పర్యటన వల్ల గిరిజనులకు ఒరిగిందేమీ లేదని, ఇది కేవలం ఆయన పబ్లిసిటీ స్టంట్ అని వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి విమర్శించారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పవన్ పర్యటనపై ఎద్దేవా చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే ‘మిషన్ కనెక్ట్ పాడేరు’ ద్వారా ఓనూరు, నందిగరువు గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించామని ఆమె గుర్తుచేశారు. ఈ విషయాలు తెలియకుండా పవన్ మాట్లాడటం సరికాదన్నారు. పసిపిల్లలను మండుటెండలో గంటల తరబడి నిలబెట్టి ఫొటోలు, వీడియోలు తీసుకోవడం పవన్ కల్యాణ్ ప్రచార యావకు నిదర్శనమని ఆరో పించారు. ప్రభుత్వ అధికారిక కార్యక్ర మాలకు వచ్చి, అధికారుల సమక్షంలోనే పార్టీ ఆవిర్భా వ దినోత్సవం నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోయిందని.. సాక్షాత్తు టీడీపీ ఎంపీయే డ్రగ్స్ పార్టీలో దొరికిపోవడం సిగ్గుచేటన్నారు. దీనికి సీఎం చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. పవన్ పర్యటనతో తమ సమస్యలు తీరుతాయని ఆశించిన గిరిజనులకు చివరకు నిరాశే మిగిలిందని భాగ్యలక్ష్మి పేర్కొన్నారు.


