మద్దిలపాలెం(విశాఖ): ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏయూ ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో శనివారం బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ఫార్మా అన్వేషణ్–2026 సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జషుబాయ్ హెచ్.చౌదరి మాట్లాడుతూ ఫార్మసీ రంగం నుంచి నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు, వాటి ఆవశ్యకతను తెలియజేసేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. ఫార్మా రంగంలో ఉత్సుకతతో సేవలందించాలనుకునే విద్యార్థులకు ఫార్మసీ కౌన్సిల్ ఒక ఉన్నత స్థాయి మార్గంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఏయూతో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఫార్మా అన్వేషణ్‌లో భాగంగా విద్యార్థులకు పోటీలు నిర్వహించి రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన వారిని జాతీయ స్థాయి పోటీలకు తీసుకెళ్తామన్నారు.
ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు కల్పించే దిశగా ఏయూ అడుగులేస్తోందని, దీనికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. త్వరలో సమ్మర్ ఇంటర్న్‌షిప్ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మంచి ఫలితాలు పొందే దిశగా ప్రతి విద్యార్థి ఉన్నతంగా ఆలోచించి లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. ఏయూ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ జి.గిరిజాశంకర్, ఫార్మా అన్వేషణ్ కార్యక్రమ జోనల్ కో ఆర్డినేటర్లు డాక్టర్ శరత్‌చంద్ర, డాక్టర్ ఎం.నిరంజన్ బాబు, ఐపీసీఏ జనరల్ సెక్రటరీ డాక్టర్ టి.వి.నారాయణ, డాక్టర్ పి.వీరరాజు, స్టేట్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎస్.ఎల్.ఎన్.ప్రసాద్‌రెడ్డి, స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.విలియం కేరి తదితరులు కార్యక్రమంలో ప్రసంగించారు. ఏయూ తరఫున అతిథులను వీసీ సత్కరించారు. సదస్సు ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. అనేక మంది ఆచార్యులు, విద్యార్థులు, ఫార్మా ప్రముఖులు పాల్గొన్నారు.


