జేసీ శౌర్యమాన్ పటేల్
తుమ్మపాల: యుద్ధ పరిస్థితుల దృష్ట్యా గ్యాస్ సిలిండర్ల పంపిణీ, నిల్వలు, ధరలపై ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ హెచ్చరించారు. ఆయన శుక్రవారం ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు, ఆయా మండలాల తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాస్ కొరత ఉందనే ఆందోళనతో వినియోగదారులు ముందుగానే బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. బుక్ చేసిన 72 గంటల్లోనే గ్యాస్ సిలిండర్ డెలివరీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిస్ట్రిబ్యూటర్లను ఆదేశించారు. ప్రతి గ్యాస్ ఏజెన్సీ వద్ద ఫోన్ నంబర్లు, సేల్స్ ఆఫీసర్, సంబంధిత తహసీల్దార్ ఫోన్ నంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, బిల్లులో ఉన్న ధర కంటే ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా, టిప్స్ పేరుతో ఒత్తిడి చేసినా డెలివరీ బాయ్స్, సదరు ఏజెన్సీలపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఓటీపీ లేకుండా ఎక్కడా సిలిండర్ డెలివరీ చేయకూడదని, పారదర్శకత పాటించాలని సూచించారు. నిల్వలను అక్రమంగా దాచడం, ఇతర అవసరాలకు మళ్లించడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, దీనికోసం సివిల్ సప్లయి, తహసీల్దార్ బృందాలు నిరంతరం తనిఖీలు చేస్తాయన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్సుల రద్దుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌వో కె.వి.ఎల్.ఎన్.మూర్తి, కలెక్టరేట్ పరిపాలన అధికారి విజయ్ కుమార్ పాల్గొన్నారు.


